Health Minister Satya Kumar Visit in Jaggayyapeta Govt Hospital: వర్షాకాలం ప్రారంభించడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల తాగునీరు కలుషితమై డయేరియా కేసులు వెలుగు చూస్తున్నాయని వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా రోగులను సత్యకుమార్ పరామర్శించారు. కాకినాడ, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని 23 గ్రామాల పరిధిలో ఇప్పటివరకు 160 డయేరియా కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. జగ్గయ్యపేటలో 58 కేసులు నమోదు అవ్వగా వాటిలో 14 మంది డిశ్చార్జ్ అయ్యారన్నారు. మిగిలిన వారందరికీ రిఫరల్ ఆస్పత్రిలో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.
డయేరియా బాధితులను పరామర్శించిన హెల్త్ డైరెక్టర్ - AP HEALTH DIRECTOR ON DIARRHEA
జగ్గయ్యపేట మండలంలోని షేర్ మహమ్మద్‌పేట, మక్కపేట గ్రామాల్లో తాగునీరు కలుషితం వల్లే డయేరియా కేసులు నమోదు అయ్యాయని ఆయన పేర్కొన్నారు. గత పాలకులు పదో ఆర్థిక సంఘం నిధులను పక్కదారి పట్టించి గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి నిర్వహణ అధ్వానంగా మార్చారని సత్యకుమార్ విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 30 వేల గ్రామాల్లో తాగునీటి పరీక్షలు చేయగా 217 గ్రామాల్లో నీరు కలుషితమైనట్లు గుర్తించామన్నారు.
ఈ విషయం గురించి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో చర్చించామన్నారు. వర్షాకాల సీజన్లో ప్రజలు వ్యాధి బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. మంత్రి వెంట జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు పలువురు వైద్యాధికారులు వెళ్లారు. డయేరియా రోగులకు అందుతున్న వైద్య సేవలపై మంత్రి సత్యకుమార్ ఆరా తీశారు. రోగులతో ఆయన మాట్లాడారు. అనంతరం అధికారులు, వైద్యులతో సమీక్ష నిర్వహించారు.