మన్యం జిల్లాలో గజరాజుల మృత్యుఘోష - జంతు ప్రేమికుల ఆందోళన (ETV Bharat) Elephants Dying in Manyam District: ఒడిశా నుంచి సరిహద్దులోని పార్వతీపురం మన్యం జిల్లాలోకి ప్రవేశించిన ఏనుగులు, జిల్లాలోని భామిని, సీతంపేట, జియ్యమ్మవలస, కొమరాడ తదితర మండలాల్లో సంచరిస్తున్నాయి. పక్క రాష్ట్రం నుంచి వచ్చిన ఏనుగులు తిరిగి అటువైపు వెళ్లడం లేదు. వాటికి అవసరమైన ఆహారం, నీరు జిల్లాలో పుష్కలంగా లభిస్తుండటంతో ఇక్కడే తిష్టవేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒడిశా, ఏపీ ప్రభుత్వాలతో పాటు, కేంద్ర సర్కారు కూడా ఏనుగులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఆ దిశగా చర్యలు తీసుకోవటం లేదు.
ఈ నేపథ్యంలో వివిధ కారణాలతో ఏనుగులు వరుసగా మృత్యువాత పడుతున్నాయి. విద్యుదాఘాతం, అనారోగ్యం, ఇతర కారణాలతో ఇప్పటివరకూ 10 ఏనుగులు మరణించాయి. అదే విధంగా ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతాల్లో మనుషులు, మూగ జీవాల ప్రాణాలు సైతం గాల్లో కలసిపోతున్నాయి. ఏటా రైతులు భారీగా పంట నష్టపోతున్నారు. 2019 నుంచి 2023 ఫిబ్రవరి వరకు ఏనుగుల దాడిలో జిల్లాలో 11మంది మనుషులు ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ ఆస్తి, ప్రాణ నష్ట నివారణ చర్యలు శూన్యం.
'తల్లి'డిల్లిన గుండె- గున్న ఏనుగు మృతదేహం వద్ద వేదన- వీడియో వైరల్! - Mother Elephant Tearful Moment
ఏనుగులు జిల్లాలోకి ప్రవేశించిన నాటి నుంచి అటవీశాఖ పలు రకాల ప్రతిపాదనలు చేసింది. తొలిసారి చేపట్టిన ఆపరేషన్ గజ ఆదిలోనే నిలిచిపోయింది. మైదాన ప్రాంతాల్లోకి రాకుండా ఉండేందుకు కందకాలు ఏర్పాటుకు నిర్ణయించారు. ఇందుకోసం పాలకొండ మండలం గుడివాడ సమీపంలో పనులు ప్రారంభించగా, గిరిజనులు వ్యతిరేకించటంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నారు. పార్వతీపురం సమీపం సాలూరు రేంజ్ పరిధి జంతికొండ వద్ద ఏనుగులు జోన్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదురుకావటంతో అటవీశాఖ అధికారులు, నిర్ణయం వెనక్కి తీసుకున్నారు.
ఏనుగుల జోన్ ఏర్పాటుకు 1,100 హెక్టార్ల వరకు భూమి అవసరం. నీటి వసతి కల్పించాలి. ఒక ఏనుగుకు 200 నుంచి 300 కిలోల వరకు ఆహారం కావాలి. రోజూ 20 మంది పర్యవేక్షించాలి. మన్యం జిల్లాలో ఏనుగుల రక్షణ అటవీ సిబ్బందికి తలకు మించిన భారంగా మారుతోంది. గజరాజులు నాగావళి నది దాటి జియ్యమ్మవలసకు అరగంటలో చేరుకుంటున్నాయి. అదే ప్రాంతానికి పార్వతీపురం మీదుగా చేరుకునేందుకు అటవీ సిబ్బంది 40 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తోంది. జోగంపేట వద్ద ఏనుగుల సంరక్షణ ప్రాంతానికి సన్నాహాలు చేసినా అది కార్యరూపం దాల్చలేదు.
అటవీ ప్రాంతాలను దాటి గజరాజులు మైదాన ప్రాంతాల్లోకి వస్తుండటంతో ప్రజలకు కంటి మీద కునుకు ఉండటం లేదు. ఆహారం, నీటి కోసం జనావాసాల్లోకి వస్తున్న ఏనుగులు పంటలకు నష్టం కలిగిస్తున్నాయి. ఏళ్ల తరబడి ఈ సమస్య వేధిస్తోన్న పరిష్కార మార్గం లభించడం లేదని, ఏనుగుల జోన్ ఏర్పాటు ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమవుతున్నాయని జిల్లా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గోశాలలోకి ప్రవేశించి ఏనుగు హల్చల్- ప్లీజ్ వెళ్లిపోండి స్వామీ అంటూ స్థానికులు రిక్వెస్ట్! - Elephant In Cowshed At Coimbatore