EC Suspend on Few Police Officers in AP : ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత చెలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీతో భేటీ అనంతరం రాష్ట్రంలో చోటు చేేసుకున్న పరిణాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. హింసాఘటనలకు బాధ్యులను చేస్తూ, మూడు జిల్లాలకు చెందిన కీలక ఉన్నతాధికారులపై కొరడా ఝుళిపించింది. పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ ఇద్దరినీ వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించింది. అలాగే, పల్నాడు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీలను బదిలీ చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. ఈ మూడు జిల్లాల్లో మొత్తం 12మంది సబార్డినేట్ పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ వారిపై శాఖాపరమైన చర్యలకూ ఆదేశించింది.
వైఎస్సార్సీపీతో కలిసి అరాచకాలు - జగన్ వీరభక్త 'బంటు'లపై వేటు - EC TRANSFERS INTELLIGENCE DG AND CP
హింసాత్మక ఘటనలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యారు : పోలింగ్ జరిగిన మే 13న పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఎక్కువగా హింస చెలరేగిందని దీన్ని నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఈసీ తెలిపింది. సీఎస్, డీజీపీతో గురువారం భేటీ అనంతరం కేంద్ర ఎన్నికల సంఘంలోని ముగ్గురు కమిషనర్లు సమావేశమై ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తంచేశారు. రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టాలని సీఎస్, డీజీపీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ఎలాంటి హింస చెలరేగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతమైతే మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించింది.
ఆ అధికారులపై వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోండి : పల్నాడు జిల్లాలో చెలరేగిన అల్లర్లను అడ్డుకట్టవేయడంలో విఫలమవ్వడంతో జిల్లా కలెక్టరు లోతేటి శివశంకర్‌పై బదిలీ వేటు వేయగా ఎస్పీ బిందు మాదవ్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. మారణాయుధాలు, నాటు బాంబులతో భారీ విధ్వంసానికి వైఎస్సార్సీపీ కుట్ర పన్నినట్లు పోలీసుల తనిఖీల్లో స్పష్టమైంది. ఈ స్థాయిలో విధ్వంసానికి తెర తీసినా పోలీసులు నిలువురించడంలో విఫలమవ్వడంతో ఈసీ చర్యలు తీసుకుంది. పల్నాడు ఎస్పీపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించింది.