Special Features of Medak Church : మెదక్‌లోని విఖ్యాత కేథడ్రల్ చర్చి కేవలం పట్టణానికే కాదు ఆసియా ఖండానికే తలమానికం. ఇది మెదక్‌లో నిర్మించిన తొలి చర్చి కాదు. దీనికంటే అనేక ఏళ్ల క్రితమే మరొకటి నిర్మితమైంది. అదే ఛాపెల్ చర్చి. స్థానికులు దీన్ని పాత చర్చిగా పిలుస్తారు. పాత చర్చిని మతబోధకుడు బర్గీస్ దొర దాదాపు 166 ఏళ్ల క్రితం నిర్మించారు ఇది నేటి వైభవానికి ప్రతీకగా నిలిచింది. ఇందుకోసం మట్టి, రాళ్లను మాత్రమే వినియోగించారు.
పైకప్పును మోదుగ ఆకులు, గడ్డితో కప్పారట. నిర్మాణానికి రూ.375 మాత్రమే ఖర్చయింది. సికింద్రాబాద్ తిరుమలగిరి చర్చిలో పనిచేస్తున్న ఛార్లెస్ వాకర్ ఫాస్నెట్ 1897లో మెదక్ చర్చికి ప్రచారకుడిగా బదిలీ అయి వచ్చారు. అనంతరం చర్చిలో ఈయనే కేథడ్రల్ రూపకర్త కావడం విశేషం.
మిషన్ ఆసుపత్రి సేవలు మిన్న : ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాలలేవీ లేని కాలంలోనే మెదక్ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలందాయి. సువార్త సేవలకు ముందే వెస్లియన్ మెథడిస్ట్ మిషనరీ వైద్యం ప్రారంభించింది. 1870-80 మధ్యకాలంలో మెదక్‌లో ‘మిషన్ హాస్పిటల్’ ఏర్పాటైంది. శస్త్రచికిత్సలను ఇంగ్లండు నుంచి వైద్యులొచ్చి చేసేవారు. మందులు కూడా అక్కడి నుంచే దిగుమతయ్యేవి. శస్త్రచికిత్స థియేటర్, ఎక్స్‌రే, ల్యాబ్ ఉండేవి. జనరల్ వార్డుతో పాటు ప్రత్యేక గదుల్లో రోగులకు సేవలు అందేవి. రుసుము నామమాత్రం.