Drinking Water Problem in the State : వేసవి రాక ముందే పల్లెలు గొంతెండుతున్నాయి. తాగునీటి కోసం నెల రోజులుగా అల్లాడుతున్న గ్రామీణులు జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో మరిన్ని అవస్థలు పడుతున్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవలసిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా చర్యలు తీసుకోవడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్నాళ్లుగా తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్న గ్రామాలకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. కానీ, గురువారం నుంచి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా నిలిపి వేయాలని ఆదేశాలివ్వడం గందరగోళ పరిస్థితులకు దారి తీసింది.
అనంతపురం జిల్లాలో టీడీపీ శ్రేణుల ఆందోళనలు - తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్
దీంతో ప్రకాశం, అనంతపురం, వైయస్‌ఆర్ జిల్లాల్లోని వందల గ్రామాలకు తాగు నీటి సరఫరా నిలిచిపోయింది. గతేడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోగా చాలా జిల్లాల్లో తాగునీటి సమస్య జనవరి నుంచే మొదలైంది. క్రమంగా అది మరింత తీవ్రం దాల్చుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దానిపై సమీక్షించి పరిష్కారానికి చర్యలు తీసుకోవలసిన సర్కారు అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండడంపై ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
పక్కనే కృష్ణమ్మ అయినా తీరని దాహార్తి
ట్యాంకర్లతో నీళ్ల సరఫరాలో అక్రమాలు జరుగుతున్నాయని భావించిన ప్రభుత్వం అడ్డుకట్ట వేయాల్సింది పోయి సమస్యను మరింత జఠిలం చేసింది. తక్కువ ట్రిప్పులు సరఫరా చేసి ఎక్కువగా చూపిస్తున్నారని ప్రభుత్వం అనుమానిస్తోంది. వాస్తవానికి ట్యాంకర్లకు ట్రాకింగ్ సిస్టం ఉన్నా.. అది సరిగా పని చేయడం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అవకతవకలను నిరోధించేందుకు సరఫరాను తాత్కాలికంగా నిలిపి వేసినట్లు అధికారులు చెబుతున్నా ఇంతకుముందే ఇలాంటి చర్యలు తీసుకుంటే ప్రజలకు ఇబ్బంది ఉండేది కాదు. కానీ, ప్రస్తుతం తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న సమయంలో ట్యాంకర్లు ఆపేయడంతో జనం గగ్గోలు పెడుతున్నారు.