Kodi Pandalu 2025 in AP : సంక్రాంతి సందడి ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా కోడి పందేలను జోరుగా నిర్వహించిన విషయం తెలిసిందే. పందెం కోడి కత్తి ధాటికి నోట్ల కట్టలు తెగిపడ్డాయి. పండగ మూడు రోజులూ కోళ్లు కాదు రూ.కోట్లు గాల్లోకి ఎగిరాయి. బరిలో దిగిన కోడి గెలిస్తే ప్రపంచాన్ని జయించిన ఆనందం. ఓడిపోతే తట్టుకోలేని అవమానాలు సర్వసాధారణం. కోడిపుంజు మెడమీద ఈకలు రెక్కించి ఒక్క ఉదుటున గాలిలోకి లేచి ప్రత్యర్థిని పడగొట్టే దృశ్యం పందెం రాయుళ్లకు కావాల్సినంత కిక్‌ని ఇచ్చింది!
రాత్రిపూట కూడా పందేలు నిర్వహించేలా ఫ్లడ్‌లైట్ల వెలుగులు, గెలుపోటములపై అనుమానాలు తలెత్తకుండా టీవీ రీప్లేలు, ప్రజలు వీటిని వీక్షించేలా ప్రత్యక్షప్రసారాలు చేశారు. జనాన్ని నియంత్రించేందుకు బౌన్సర్ల బందోబస్తుతో బరులన్నీ కార్పొరేట్ స్థాయిని సంతరించుకున్నాయి. మద్యం పరవళ్లు, మాంసాహార విందులతో ప్రతి బరిలోనూ పండగే అన్నట్లుగా సాగింది. దీంతో కోళ్లు ఢీ అంటే ఢీ అంటూ సై అంటే సై అంటూ హోరాహోరీగా తలపడి రక్తం చిందించాయి.
అయితే ప్రత్యర్థిని పడగొట్టిన కోళ్లు పందెం సొమ్ము గెలిస్తే ఓడినవి మాత్రం మాంసం ప్రియుల మనసు గెలిచాయి. బరిలో చనిపోయిన పందెం పుంజులకు కూడా డిమాండ్ చాలా ఉంది. ప్రాణాలు కోల్పోయాక కూడా వాటిని కొనేందుకు కొందరు ఆస్తక్తిని కనబరుస్తున్నారు. వీటిని పోటీపడి మరీ దక్కించుకుంటున్నారు. తాజాగా పందెంలో చనిపోయిన పుంజునూ రూ.లక్ష పెట్టి కొనుగోలు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.