Comprehensive Family Survey in Telangana : తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వేలో తొలి దశ బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రలో మొదటి రోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికార కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ ప్రక్రియను ఈ నెల 9న ప్రారంభించి నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటగా ఇంటి నంబరు, అందులో నివసించే యజమాని పేరు నమోదు చేసే ప్రక్రియ సాగింది. ఇందులో ఒక్కో గణకుడికి 150 నుంచి 175 ఇళ్ల దాకా కేటాయించగా, వారు శుక్రవారం వరకు ఆ వివరాలను నమోదు చేస్తారు.
Samagra Kutumba Survey In Telangana :అప్పటికల్లా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎన్ని ఇళ్లు ఉన్నాయో, వాటిలో ఎన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నాయో అనే జాబితా సిద్ధమవుతుంది. అప్పుడు ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఈ సమాచారం ఆధారంగా ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబంలోని సభ్యులందరి సమగ్ర వివరాలు సేకరించి నమోదు చేసుకుంటారు.
తొలి రోజు నమోదు ప్రక్రియ : తొలిరోజు ఇంటి నంబరు, నివసించే యజమాని పేరు వంటి వివరాలు నమోదు చేసుకున్న తర్వాత గణకులు ఆయా ఇళ్లకు స్టిక్కర్లు అంటించారు. అందులో ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 11,97,554 ఇళ్లకు గానూ 95,106(48 శాతం) ఇళ్లకు తొలిరోజే స్టిక్కర్లును అంటించినట్లు జిల్లా అధికారులు తెలిపారు.
తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే - ఆ పత్రాలన్నీ రెడీ చేసుకోండి !
మొత్తం సర్వే విధానం :తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 1,17,44,954 కుటుంబాలు ఉన్నాయి. ఎన్యూమరేషన్ బ్లాక్లుగా 87,092 ఇళ్లను విభజించినట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ తెలిపింది. ఇందులో గ్రేటర్ హైదరాబాద్లోనే మొత్తం 28,32,490 కుటుంబాలు నివాసం ఉండగా, వాటిని 19,328 ఎన్యూమరేషన్ బ్లాక్లుగా విభజించడం జరిగింది. మొత్తం సర్వే పూర్తి చేయడానికి 94,750 మంది గణకులు, వారిపై 9,478 మంది సూపర్వైజర్లను ప్రభుత్వం నియమించింది.