Complications of Cesarean Deliveries :అవసరం లేకున్నా బంధువులను భయపెట్టి :కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే సిజేరియన్లు చేయాలి. ఇవి మొత్తం కాన్పుల్లో 25 శాతానికి మించడం ప్రమాదం. పల్నాడు జిల్లాలో 55 శాతానికిపైగా ఉంటున్నాయి. సుఖ ప్రసవానికి వీలు లేనప్పుడు, కడుపులో బిడ్డ సరిగా లేనప్పుడే సిజేరియన్లు చేయాలి. సహజ ప్రసవానికి అవకాశం ఉన్నప్పటికీ ఉమ్మనీరు తక్కువగా ఉందని, బిడ్డ అడ్డం తిరిగిందని, గుండె వేగంగా కొట్టుకుంటోందని, పురిటి నొప్పుల బాధ భరించలేరని చెబుతూ బంధువులను భయపెట్టి అవసరం లేకపోయినా సిజేరియన్లు చేస్తున్నారు. సాధారణ ప్రసవంతో పోలిస్తే సిజేరియన్ ప్రసవాలకు పట్టే సమయం చాలా తక్కువ. శస్త్ర చికిత్స వల్ల ఆసుపత్రికి ఆదాయం సమకూరుతుంది. అయితే సదరు మహిళకు తర్వాత తరచూ కడుపునొప్పి, ఇన్‌ఫెక్షన్, అధిక బరువు, నెలసరి వంటి సమస్యలు ఎదురవుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఇటీవల ఒక గర్భిణి కాన్పుకు వచ్చింది. ఆమె సహజ కాన్పునకు అవసరమైన ఆరోగ్య, మానసిక పరిస్థితులున్నాయి. మూడు నెలలుగా చేస్తున్న పలు పరీక్షల రిపోర్టులు కూడా సహజ ప్రసవం చేయొచ్చు అని తేల్చాయి. సాధారణ కాన్పు చేయాలని కుటుంబ సభ్యులు కోరారు. అయినా సరే ఆసుపత్రి సిబ్బంది భయపెట్టి సిజేరియన్ వైపు మళ్లించారు. సుమారు రూ.1.2 లక్షల దాకా బిల్లు వేశారు. నెల తిరగక ముందే ఆ మహిళకు తీవ్ర కడుపునొప్పి వచ్చింది. వైద్యులను సంప్రదిస్తే సిజేరియన్ దుష్పరిణామాల వల్లే ఇలా జరిగిందని చెప్పారు. ఈ పరిస్థితి జిల్లాలో చాలా మంది మహిళలకు శాపంగా మారుతోంది.
ముందు నేను డాక్టర్ను-తరువాతే రాజకీయవేత్తను! గర్భిణీ కోసం ప్రచారాన్ని పక్కన పెట్టిన టీడీపీ అభ్యర్థిపై ప్రశంసల జల్లు - TDP MLA candidate
ఇలాగైతే తల్లీబిడ్డకు కష్టాలు :ప్రస్తుతం ఎక్కువగా జరుగుతున్న సిజేరియన్ల వల్ల తల్లీబిడ్డకు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదాలు ఉన్నాయని నిపుణులైన వైద్యులు చెబుతున్నారు. పుట్టిన మొదటి గంటలో శిశువు తల్లిపాలు తాగితే అమృతంతో సమానం అంటున్నారు. శస్త్రచికిత్సల కారణంగా మొదటిగంటలో తల్లిపాలు తాగే వీలు లేకుండా పోవడంతో నష్టం జరుగుతోంది. రక్తస్రావం అధికమైనా, ఇతరత్రా సమస్యలు తలెత్తినా ప్రాణాపాయంతో పాటు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.
గర్భాశయానికి గాట్లు పెట్టి కుట్లు వేసిన ప్రాంతంలో మాయ అతుక్కుపోయే అవకాశాలుంటాయి. దీంతో అప్పుడప్పుడు తీవ్ర కడుపు నొప్పి సమస్యలు తలెత్తవచ్చు. కొన్ని సందర్భాల్లో గర్భసంచి తొలగించే పరిస్థితి ఎదురవుతుంది. సాధారణ ప్రసవాలే తల్లీపిల్లలకు మేలు. మహిళలు రెండురోజుల్లోనే ఎప్పటిలా పనులు చేసుకోవచ్చు. రెండో కాన్పుపై దుష్ప్రభావం ఉండదు. గర్భసంచికి ప్రమాదం తక్కువ. భవిష్యత్తులో రుగ్మతలకు గురికాకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. పుట్టిన బిడ్డకు మొదటి గంటలో తల్లిపాలు అందించవచ్చు.
'ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం సాధారణ ప్రసవాలు జరిగేలా చూస్తున్నాం. అత్యవసరమైన సమయాల్లో మాత్రమే సిజేరియన్‌కు రిఫర్ చేస్తాం. ప్రైవేటులో అనవసరంగా సిజేరియన్లు జరుగుతున్నాయని తెలిస్తే తనిఖీలు నిర్వహిస్తూ మెమోలు జారీ చేస్తున్నాం. ప్రత్యేకంగా ఆడిట్ చేస్తున్నాంకొందరు గర్భిణులు, కుటుంబ సభ్యులు కూడా సిజేరియన్ల వైపు మొగ్గుచూపుతున్నారు. నొప్పి భయం, మంచి ముహూర్తం అంటూ వైద్యులపై ఒత్తిడి తెచ్చేవారు ఉంటున్నారు. .' -రవి, డీఎంహెచ్‌వో