Chandrababu Speach In Telugu Language Day Celebrations:మాతృభాషలో అధ్యయనం చేస్తేనే విజ్ఞానం వస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్ పాల్గొన్నారు. కలెక్టర్ సృజన, సీపీ రాజశేఖర్‌బాబు సీఎంకు స్వాగతం పలికారు.
భాష మరిచిపోతే జాతి కనుమరుగవుతుంది :మాతృభాషను మరిచిపోతే జాతి కనుమరుగు అవుతుందని చంద్రబాబు అన్నారు. పరిజ్ఞానం రావాలంటే మాతృభాషలో ప్రాథమిక విద్య కొనసాగాలని, ఆంగ్లం నేర్చుకుంటేనే జీవితం ఉందంటూ గత ప్రభుత్వ నేతలు మాట్లాడారని గుర్తు చేశారు. భాష అనేది కమ్యూనికేషన్ మాత్రమేనని, తెలుగు భాషను కాపాడతామని హామీ ఇచ్చారు. జీతం కోసం ఆంగ్లం, జీవితం కోసం తెలుగు నేర్పిస్తామని వెల్లడించారు. నేను తెలుగువాడినని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునే రోజు వస్తుందని అన్నారు. భాష మరిచిపోతే జాతి కనుమరుగవుతుందని వ్యాఖ్యానించారు. జీవో నెంబరు 77పై అధ్యయనం చేస్తామని తెలిపారు. 2047 నాటికి దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉండాలని కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
మాతృభాషలో ప్రాథమిక విద్య కొనసాగాలి :త్యాగాలు చేస్తేనే జాతి గుర్తుపెట్టుకుంటుందని చంద్రబాబు వెల్లడించారు. దేశంలో అధికంగా మాట్లాడుతున్న భాషల్లో తెలుగు నాలుగో స్థానంలో ఉందని తెలిపారు. ఆంగ్లం వస్తేనే ఉద్యోగాలు, డబ్బులు వస్తాయని అపోహ ఉందని, పరిజ్ఞానం రావాలంటే మాతృభాషలో ప్రాథమిక విద్య కొనసాగాలని అన్నారు.