Cine Hero Balakrishna Suggestions to Byke Riders About Helmet: ప్రాణం పోతే మళ్లీ రాదని, ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించి నడపాలని సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సూచించారు. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా హిందూపురం రవాణాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించి బుల్లెట్ నడిపారు.
అనంతరం బాలకృష్ణ ద్విచక్ర వాహనాలు నడిపే వారికి పలు సూచనలు చేశారు. "బైక్ నడిపే వాళ్లు హెల్మెట్ కచ్చితంగా ధరించాలి. కొన్నిసార్లు తప్పు మనవైపు జరగకపోవచ్చు. కొన్నిసార్లు మనది కూడా కావచ్చు. ప్రమాదం ఎలా వస్తుందో తెలియదు. రోడ్డుపై వెళ్లేటప్పుడు జాగ్రత్తగా బైక్ నడుపుకొంటూ వెళ్లాలి. అలాగే, కారు నడిపేవాళ్లు సీటు బెల్ట్ పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఒక పౌరుడిగా మీపై కూడా బాధ్యత ఉంది. రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు సరిగా పాటించకపోతే, కఠిన శిక్షలు పడతాయి. లైసెన్స్ కూడా రద్దు చేస్తారు. ఈ మధ్య ఇతరులను చూసి అనుకరించడం ఎక్కువైపోయింది.
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి, ఇతరులకు చూపించుకోవడానికి బైక్స్‌పై ఫీట్స్ చేస్తున్నారు. జీవితమంటే ఇది కాదు. జీవితం చాలా విలువైనది. ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ సీసీటీవీలను ఏర్పాటు చేస్తోంది. నిబంధనలు అతిక్రమించి వాహనాలను నడుపుతున్న వారిపై చర్యలు తీసుకుంటోంది. దయచేసి నిబంధనలు పాటించి, ప్రాణాలు కాపాడుకోండి’’ అని బాలకృష్ణ సూచించారు.