Children Summer Camp in Guntur District :మారుతున్న జీవనశైలి, ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే తపన పెద్దలే కాదు చిన్నపిల్లల్లోనూ కనిపిస్తోంది. ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీ పడే విద్యార్థులు ఆటవిడుపు కోసం సమ్మర్ క్యాంపుల్లో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతున్నారు. శరీర దారుఢ్యాన్ని పెంపొందించుకునేందుకు క్రికెట్, వాలీబాల్, టెన్నిస్‌తో పాటు స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారు. ఎండలో చల్లని నీటిలో ఈత కొడుతూ కేరింతలు కొడుతున్నారు.
గుంటూరులో క్రికెట్ అకాడమీలు, టెన్నిస్ శిక్షణా కేంద్రాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక వేసవి శిక్షణా తరగతులకు విశేష స్పందన వస్తోంది. అయితే ఎన్ని రకాల క్రీడలు ఆడినా వివిధ వ్యాయామాలు చేసినా దక్కని చక్కటి ఫలితం ఈత వల్లే సాధ్యమవుతోంది. దీంతో స్విమ్మింగ్ నేర్చుకునేందుకు విద్యార్థులు అమితాసక్తి చూపుతున్నారు. చిన్నారులతో ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలోని స్విమ్మింగ్ పూల్ కిటకిటలాడుతోంది. నగరంలో ఉన్న వాటిలో ఇదే కాస్త పెద్దది కావడంతో విపరీతమైన రద్దీ ఏర్పడింది. ఈత కొలనులో రోజుకు 250 మందికి ఈత నేర్పే అవకాశం ఉండగా అంతకుమించి సుమారు 500 మందికి పైగా చిన్నాపెద్దా తేడా లేకుండా స్విమ్మింగ్ సాధన చేసేందుకు క్యూ కడుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ఈత కొలను కిక్కిరిసిపోతోంది.
గుంటూరులో 10 లక్షలకు పైగా జనాభా ఉండగా నగరపాలక సంస్థ ఆధ్వర్వంలో కేవలం ఒక స్విమ్మింగ్ పూల్ మాత్రమే ఉంది. శ్యామలా నగర్‌లో ఉన్న ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలోని ఈతకొలను రెండున్నర ఎకరాల్లో విశాల ప్రాంగణంలో ఉంది. 25 మీటర్ల ప్రధాన ఈతకొలనుతో పాటు చిన్నారుల కోసం బేబీ పూల్ కూడా ఉంది. అంతేకాదు ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్ అన్నింటికంటే ఇక్కడ ఫీజు కూడా కాస్త తక్కువే. 14 ఏళ్ల పిల్లలకు 1200, పెద్దలకు 1500 రూపాయలు వసూలు చేస్తుండటంతో ఎక్కువ మంది ఇక్కడే శిక్షణ తీసుకునేందుకు మెుగ్గు చూపుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఈత నేర్చుకుంటున్నారు. ఈతలో వివిధ రకాల మెళకువలు నేర్చుకుంటూ చేప పిల్లల్లా ఈదేస్తున్నారు.