Charged as Second Additional SP in Police Department Retires Within 24 Hours :పార్వతీపురం మన్యం జిల్లా ఆవిర్భవించిన తర్వాత పోలీసు శాఖలో రెండో అదనపు ఎస్పీగా ఎల్.నాగేశ్వరి బాధ్యతలు స్వీకరించారు. అయితే కుర్చీ ఎక్కిన 24 గంటల్లోనే ఉద్యోగ విరమణ చేయనున్నారు. 1989 బ్యాచ్‌లో ఎస్సైగా ఎంపికైన ఈమె వివిధ హోదాల్లో పనిచేశారు. ఇటీవలే డీఎస్పీ నుంచి ఏఎస్పీగా పదోన్నతి పొందారు. విరమణ పొందే సమయానికి ఎక్కడో ఒకచోట విధుల్లో ఉండాలనే నిబంధనను అనుసరించి ఆమెను పార్వతీపురం అదనపు ఎస్పీగా నియమించారు. గురువారం దస్త్రంపై సంతకం చేసిన ఆమె శుక్రవారం సాయంత్రానికి విశ్రాంత ఏఎస్పీగా మారిపోనున్నారు.
ఓనమాలు దిద్దిన చోటే :తాను ఓనమాలు దిద్దిన ప్రాంతంలోనే అదనపు ఎస్పీగా ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈమె తండ్రి కూడా పోలీసు శాఖలో పనిచేసి రిటైరయ్యారు. నాగేశ్వరి విద్యాభ్యాసం పార్వతీపురంలోనే ప్రారంభమైంది. పట్టణంలోని బాలికల ఆర్సీఎం పాఠశాలలో ఐదో తరగతి వరకు చదివారు. తర్వాత బొబ్బిలి సీబీఎం పాఠశాలలో పదో తరగతి వరకు, ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యను విజయనగరంలో పూర్తి చేశారు. 1989లో ఎస్సైగా ఎంపికయ్యారు. ఎక్కువ కాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ ప్రాంతంలోనే పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి తిరిగి వచ్చారు.