Chandrababu Mark in Governance System : 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో కలెక్టర్ల సదస్సు అంటే 2రోజుల పాటు జరిగేది. వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపై పదుల సంఖ్యలో స్లైడ్స్ తయారు చేసేవారు. చంద్రబాబు వాటిపై గంటల కొద్దీ సుదీర్ఘంగా అర్ధరాత్రి వరకు చర్చించేవారు. కానీ ఇప్పుడు ఆయన పని విధానం మారింది. సమీక్షలు తగ్గించారు. వాటి సమయాన్నీ కుదించారు. కలెక్టర్ల సదస్సును ఒక్క రోజుకే పరిమితం చేశారు. ఒక్కో శాఖకు సంబంధించి మూడు, నాలుగు స్లైడ్స్ మించకూడదని స్పష్టం చేశారు. పాలనలోనూ చంద్రబాబు ప్రత్యేక శైలితో ముందుకు సాగుతున్నారు.
నిర్ణయాల్లో వేగం పెంచిన ముఖ్యమంత్రి :నిర్దేశిత సమయంలోనే చంద్రబాబు సమీక్షలు ముగిస్తున్నారు. సూటిగా, సమస్యకు పరిష్కారం చూపేలా నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. సాధ్యమైనంత ఎక్కువగా ప్రజలను కలిసేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. శని, ఆదివారాల్లో ప్రభుత్వ అధికారులతో సమీక్షలు, సమావేశాలను రద్దు చేశారు. శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్లి ప్రజావినతులు స్వీకరిస్తున్నారు. రోజుకో మంత్రి, పార్టీ నాయకుడి ద్వారా వినతులు తీసుకుని పరిష్కరించే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రజలను కలిసి వారి సమస్యల పరిష్కారినికే ప్రాధాన్యం :పింఛన్ల పంపిణీతోపాటు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్ని కలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి చంద్రబాబు ప్రాధాన్యమిస్తున్నారు. విద్య, అనారోగ్య సమస్యలపై వచ్చే వారికి. తక్షణమే ఆర్థిక సాయం మంజూరు చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు సమయమిస్తూ వారి అభిప్రాయాలు ముఖ్యమంత్రి తీసుకుంటున్నారు.
"ఇక స్పీడ్ పెంచడం తప్ప వెనక్కిపోయేది ఉండదు. 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారు. చరిత్ర గుర్తు పెట్టుకోవాలని, నువ్వు కూడా అప్పట్లో కుర్రాడివని, నీకు కూడా ఐడియా లేదు హైదరాబాద్ నుంచి బయల్దేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. ఇప్పుడు అంతలా ఉండదు కానీ, తప్పు చేస్తే మాత్రం ఎవర్నీ వదిలిపెట్టను. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి." - చంద్రబాబు, ముఖ్యమంత్రి
CBN Mark Rule in AP :ఏదైనా శాఖకు సంబంధించి పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వార్తలు, కథనాలు వచ్చినా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు. దీన్ని పూర్తిగా మార్చాలని, మీడియాలో వచ్చే వార్తలపై స్పందించాలని, అధికారులను జవాబుదారీ చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. సీఎంవో నుంచి మండలస్థాయి అధికారుల వరకు అందరినీ అప్రమత్తం చేసేలా ప్రత్యేక విధానం సిద్ధం చేస్తున్నారు.