Chandrababu on Palnadu District Clashes: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో రాష్ట్రంలో జరుగుతున్న హింసపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. మాచర్లలో ఇప్పటికీ దాడులు జరగడం పోలీసుల వైఫల్యమేనని మండిపడ్డారు. ఈ ప్రాంతంలో ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడడంలో పోలీసు అధికారులు విఫలం అయ్యారని చంద్రబాబు విమర్శించారు. ఉదయం నుంచి పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తున్నా, శాంతి భద్రతలు కాపాడలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ వెంటనే ఈ ప్రాంతంలో పోలింగ్‌పై సమీక్షించి, పరిస్థితిని చక్కదిద్దాలని కోరారు.
Chandrababu on Attack on SP Vehicle: పోలింగ్‌లో వైఎస్సార్సీపీ పాల్పడున్న హింసతో కనీసం పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తాడిపత్రిలో ఏకంగా ఎస్పీ వాహనం పైనేదాడి చేయడం, తాడిపత్రి టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డిపై దాడికి దిగడం, వైఎస్సార్సీపీ హింసా రాజకీయాలకు పరాకాష్ట అని ధ్వజమెత్తారు. జగన్ 5 ఏళ్లుగా పెంచి పోషించిన రౌడీ మూకలు, ఈ రోజు తమ దాడుల ద్వారా ప్రజల్లో భయం పుట్టించి పోలింగ్ శాతాన్ని తగ్గించడం ద్వారా లబ్ధి పొందే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలందరూ ఈ కుట్రను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ నిర్భయంగా తరలివచ్చి ఓటు వేయాలన్నారు. అత్యధిక ఓటు శాతంతో వైఎస్సార్సీపీ హింసా రాజకీయానికి ముగింపు పలకాలని ట్వీట్ చేశారు.
వరుస హింసాత్మక ఘటనలు:కాగా పల్నాడు జిల్లా మాచర్లలో ఉదయం నుంచి వరుసగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మాచర్ల 216, 205, 206, 207 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిలిచిపోయింది. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఈవీఎంలను ధ్వంసం చేశారు. దీంతో పోలింగ్ నిలిపివేసి భయంతో సిబ్బంది బయటకు పరుగులు తీశారు. అదే విధంగా మాచర్ల నియోజకవర్గం రెంటాలలో టీడీపీ అభ్యర్థి వాహనంపై వైఎస్సార్సీపీ మూకలు దాడి చేశాయి. రెంటాలలో పోలింగ్ సరళిని చూసేందుకు వెళ్లిన జూలకంటి బ్రహ్మానందరెడ్డి వాహనంపై వైఎస్సార్సీపీ మూకలు రాళ్లు విసిరారు. దీంతో వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
మాచర్ల నియోజకవర్గం తుమ్మరకోటలో టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరువర్గాల ఘర్షణలో తుమ్మరకోటలో 10 బైకులు ధ్వంసం అయ్యాయి. తుమ్మరకోటలోని పోలింగ్ బూత్‌లో ఈవీఎం ధ్వంసం చేశారు. పోలింగ్ నిలిచిపోవడంతో, ఘటనాస్థలికి ఐజీ శ్రీకాంత్, ఎస్పీ బిందుమాధవ్ చేరుకుని పరిశీలించారు. వెల్దుర్తి మండలం లోయపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ వర్గీయులను పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపడంపై టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. వైఎస్సార్సీపీ నాయకుల దాడిలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. మాచర్ల నియోజకవర్గం కంభంపాడులో గొడ్డళ్లు, వేటకొడవళ్లు, రాడ్లతో రహదారి పైకి వచ్చి టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కంభంపాడులో భారీగా పోలీసులు మోహరించారు. ఐజీ శ్రీకాంత్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.