Chandrababu Prajagalam Sabha: వైసీపీ పాలనలో దెందులూరు దందాల ఊరుగా మారిందని, తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. గుడి, బడి అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ మద్యం అమ్మతున్నారని మండిపడ్డారు. ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ప్రజల జీవన ప్రమాణాలు పెంచే బాధ్యత తాను తీసుకుంటానని నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వైసీపీ పాలనలో అన్ని రంగాలు సంక్షోభంలో ఉన్నాయని పేర్కొన్నారు. సంపద సృష్టిస్తాం.. పేదలకు పంచుతాం హామీ ఇచ్చారు. పేదల కష్టాలకు పరిష్కార మార్గాన్ని చూపిస్తామన్నారు. ఆక్వా రైతులకు 1.5 రూపాయలకు విద్యుత్ ఇప్పిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. పామాయిల్‌కు 90 శాతం రాయితీతో డ్రిప్ ఇరిగేషన్ అందిస్తామన్నారు. దెందులూరును దందాల ఊరుగా మార్చారని దుయ్యబట్టారు.దెందులూరు ఎమ్మెల్యే పేకాట కంపెనీలు తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు. గుడి, బడి తేడా లేకుండా మద్యం అమ్ముతున్నారని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
అబద్ధాలు చెప్పడంలో జగన్ పీహెచ్‌డీ చేశారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వంలో బాధితులను నిందితులుగా, నిందితులను బాధితులుగా చేస్తారని ఆరోపించారు. వివేకాను చంపించి ఆయన కుమార్తెపైనే కేసులు పెట్టేలా చేశారని చంద్రబాబు మండిపడ్డారు. కొత్తగా జగన్ గ్రాబింగ్ యాక్టు తీసుకువచ్చారని, ఇప్పటివరకు బలవంతంగా మీ భూములు లాక్కున్నారన్న చంద్రబాబు, ఇకపై నల్ల చట్టం వచ్చాక ఆన్‌లైన్‌లో మీ రికార్డులు మారుస్తారని తెలిపారు. నల్ల చట్టం వస్తే మీ ఆస్తులకు యజమాని మారుతారని పేర్కొన్నారు.
'అవసరాలు తీర్చేలా, ఆశలు నెరవేర్చేలా' కూటమి మేనిఫెస్టో- నిరుద్యోగ యువత కోసం తొలి సంతకం - TDP JANASENA BJP MANIFESTO RELEASED