VIZAG STEEL PLANT MERGE WITH SAIL: వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశలో కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ మేరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో (SAIL) విలీనం చేసేందుకు కసరత్తు చేస్తోంది. వైజాగ్ స్టీల్ మనుగడకు విలీనాన్ని కేంద్రం ఒక ప్రత్యామ్నాయంగా భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఆర్థికంగా నష్టాల్లో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను (Rashtriya Ispat Nigam Limited) మరో ప్రభుత్వరంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో విలీనం చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్యకలాపాల కొనసాగింపు కోసం మూలధనాన్ని అందించడానికి జాతీయ ఖనిజ వనరుల అభివృద్ధి సంస్థకి (National Mineral Development Corporation) భూములు విక్రయించాలనే మరో ప్రత్యామ్నాయాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి.
స్టీల్ ప్లాంట్‌కు చెందిన 1500 నుంచి 2 వేల ఎకరాలను NMDCకి విక్రయించి అందులో పెల్లెట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలిపాయి. స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలను కొనసాగించేందుకు.. ఆర్థిక సాయాన్ని అందించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించాయి. అటు బ్యాంకు రుణాలపైనా ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన అధికారులు, ఉక్కుశాఖ కార్యదర్శి ఎస్‌బీఐకు (State Bank of India) చెందిన అధికారులతో చర్చించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. విశాఖ స్టీల్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశలోనే ఈ ప్రయత్నాలు సాగుతున్నట్టు వెల్లడించాయి.