Central Government Help Telugu States Due to Floods:భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అల్లకల్లోలమైన తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కలిపి రూ.3,300 కోట్లు విడుదల చేసింది. తక్షణ సహాయక చర్యల కోసం ఈ నిధులు విడుదల చేసినట్టు ప్రకటించింది. ఇప్పటికే కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో పాటు, కేంద్ర బృందం తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించింది.
కేంద్రం వరద సాయం - తెలుగు రాష్ట్రాలకు రూ.3,300 కోట్లు - central govt announce flood relief
Central Government Help Telugu States Due to Floods: వరదలతో అతలాకుతమైన తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ క్రమంలో రెండు రాష్ట్రాలకు కలిపి రూ.3,300 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 6, 2024, 5:14 PM IST
|Updated : Sep 6, 2024, 5:47 PM IST
తెలుగు రాష్ట్రాల్లో సహాయ చర్యలపై ఎక్స్ ద్వారా కేంద్రం వివరాలు వెల్లడించింది. ప్రధాని ఆదేశాల మేరకు ఏపీ, తెలంగాణకు పూర్తి సహకారం అందజేయనున్నట్లు తెలిపింది. వరద ప్రాంతాలకు ఇప్పటికే నిపుణుల బృందం పంపామని, వరదలు, డ్యామ్‌లు, వాటి భద్రతను ఆ బృందం పరిశీలిస్తుందని వెల్లడించింది. వరద నష్టం అంచనాకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఏపీలో 26 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, 8 వైమానికదళ హెలికాప్టర్లు ఉన్నాయని హోంశాఖ స్పష్టం చేసింది. ఏపీలో 3 నౌకాదళ హెలికాప్టర్లు, డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ఏపీలో 350 మందిని రక్షించినట్లు, 15 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించింది.
లోకేశ్ కృతజ్ఞతలు: కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ చౌహాన్ విజయవాడ వచ్చి వెళ్లిన 24 గంటల్లోనే కేంద్ర సాయం ప్రకటించడంపై మంత్రి లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, వ్యవసాయ మంత్రి చౌహాన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.