Case on Vallabhaneni Vamsi Followers in Gannavaram : గన్నవరం పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే వంశీ అతని అనుచరులపై మంగళవారం రాత్రి పోలీసులకు మరో ఫిర్యాదు అందినట్లు విశ్వసనీయ సమాచారం. పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రస్తుతం కోనాయి చెరువు పైలట్ ప్రాజెక్టుకు అదనంగా మరో రిజర్వాయర్ పేరుతో మాజీ ఎమ్మెల్యే వంశీ అతని అనుచరులు సాధారణ ఎన్నికలకు ఆరు నెలల ముందు మట్టి తవ్వకాలు చేపట్టారు.
గొల్లపూడి-చిన్నఅవుటపల్లి బైపాస్‌కు అత్యంత సమీపంలోని తొండం గట్టు చెరువులో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు చేపట్టి కోట్లు సంపాదించారని మర్లపాలెంకు చెందిన మురళీ అనే రైతు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఫిర్యాదుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఫిర్యాదును పోలీసులు ధ్రువీకరించలేదు. గన్నవరం మండలం కేసరపల్లిలో జరిగిన సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి జిల్లా మైనింగ్ అధికారి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు క్వారీ అనుమతితో అన్నే హరికృష్ణ మట్టి తవ్వకాలు చేపట్టారు.