C-Vigil App Importance in Elections : మీ కళ్లముందు ఏదైనా ఎన్నికల ఉల్లంఘన జరుగుతుందా. రాజకీయ పార్టీల నాయకులు ఓట్ల కోసం ప్రలోభ పెడుతున్నారని మీకు తెలిసిందా. ఓటర్లను బెదిరింపులకు గురి చేస్తున్నారా. మద్యం, మత్తుపదార్థాలు పంచుతున్నట్లు గ్రహించారా. అనుమతి లేని వాహనాలను ప్రచారానికి వినియోగిస్తున్నారా. సమయం ముగిసినా ప్రచారం చేస్తున్నారా. ఎన్నికల సమయంలో అధికారులు బాధ్యతా రహిత్యంగా వ్యవహరిస్తున్నారా. ఇరు పార్టీల నాయకులు దాడులు చేసుకుంటున్నారా. రాజకీయ నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారా. ఇలాంటిది ఏదైనా జరిగితే దానిని సీ- విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయండి. దానిపై విచారణ జరిపి వంద నిమిషాల్లోనే కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటామంటోంది. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని నిపుణులు అంటున్నారు.
ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఎన్నికలు సజావుగా సాగేలా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రాజకీయ నాయకులందరూ పాటించేలా ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేలా కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. కానీ ఈసీ దృష్టికి రాని ఎన్నికల ఉల్లంఘనలు అనేకం ఉంటాయి. వాటన్నింటిని తెలుసుకునేలా అందులో ఓటర్లను, పౌరులను భాగస్వామ్యం చేసేలా ఈసీ రూపొందించిందే సీ-విజిల్ మొబైల్ యాప్. పౌరులెవరైనా ఎన్నికల ఉల్లంఘనలు జరుగనున్నాయని గ్రహించి ఈ యాప్‌లో ఫిర్యాదు చేస్తే చాలు దానిపై వీలైనంత త్వరలో చర్యలు తీసుకునేలా సీ-విజిల్ యాప్‌ను రూపొందించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచే ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఎన్నికల ఉల్లంఘనలకు సంబంధించిన సమగ్ర వివరాలతో దీని ద్వారా ఈసీకి ఫిర్యాదు చేయవచ్చు. అందుకు మొదటగా గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఎన్నికల సంఘం వారి సీ-విజిల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత మొబైల్ నంబరుతో రిజిస్టర్ చేసుకుంటే ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేస్తే సీ-విజిల్ యాప్ సిద్ధమైనట్లే. దాని ద్వారా ఎన్నికల ఉల్లంఘనలను ఈసీకి ఫిర్యాదు చేయవచ్చు.
'నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా ఎన్నికలు జరగడమే లక్ష్యం' - సీఈసీ రాజీవ్ కుమార్
సీ-విజిల్ యాప్ ద్వారా పౌరులు ఫిర్యాదు చేసేటప్పుడు కచ్చితమైన ఫొటో, వీడియో రూపంలో సమాచారం అందించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మొబైల్‌లో యాప్‌ను ఓపెన్ చేయగానే ఫొటో, వీడియో, ఆడియో అనే 3 ఆప్షన్లు కనిపిస్తాయి. ఒకవేళ ఫొటో ద్వారా ఫిర్యాదు చేయాలనుకుంటే ఫొటో ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. అప్పుడు మీ లొకేషన్ నమోదవుతుంది. ఉల్లంఘనకు సంబంధించిన ఫొటోను అప్‌లోడ్ చేయాలి. ఏ రాష్ట్రం, నియోజకవర్గం తదితర వివరాలను నమోదు చేయాలి. సదరు ఉల్లంఘనను క్లుప్తంగా వివరించాలి. ఈ ఫిర్యాదు నిమిషాల వ్యవధిలోనే ఎన్నికల సంఘానికి చేరుతుంది. యాప్‌లో వివరాలు పొందుపర్చిన 5 నిమిషాల్లోనే జిల్లా ఎన్నికల అధికారి దానిని ఫీల్డ్ యూనిట్‌కు పంపిస్తారు. వారు 15నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకొని 30 నిమిషాల్లో వివరాలు సేకరిస్తారు. అనంతరం ఎన్నికల అధికారికి తెలియజేస్తారు. ఎన్నికల అధికారి దానిపై 50 నిమిషాల్లో చర్యలు తీసుకుంటారు. ఇలా మొత్తంగా 100 నిమిషాల్లో సీ-విజిల్ యాప్‌లో చేసిన ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటారు. ఫిర్యాదు స్టేటస్ కూడా తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది.
'ఓటు వేసేందుకు ఆధార్ తప్పనిసరి కాదు'- కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ
2018లో అమల్లోకి వచ్చిన సీ- విజిల్ మొబైల్ యాప్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లఘనలకు సంబంధించి పౌరుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. దేశంలోని ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వేల సంఖ్యలో ఫిర్యాదులు అందగా సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో ఎన్నికల అధికారులు వాటిపై చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఇటీవలే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లోనూ 7వేలకు పైగా ఫిర్యాదులు సీ- విజిల్ ద్వారా అందినట్లు ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ వెల్లడించారు. ఇందులో దాదాపు 90శాతం ఫిర్యాదులకు నిర్ణీత 100 నిమిషాల్లోనే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.