ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

30 రోజుల్లో 65 - ముచ్చెమటలు పట్టిస్తున్న ఆగంతకులు - సంస్థలపై తీవ్ర భారం - BOMB THREATS TO SHAMSHABAD AIRPORT

రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకి అక్టోబరు 1 నుంచి 30 వరకూ 65 బెదిరింపులు - విశాఖ ఎయిర్​పోర్ట్​కు సైతం

Bomb_Threats_to_Flights
Bomb Threats to Flights (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 31, 2024, 1:03 PM IST

Bomb Threats to Flights: విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. హైదరాబాద్​ శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు, విశాఖ ఎయిర్​పోర్ట్​ నుంచి రాకపోకలు సాగించే విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తుండటం దడ పుట్టిస్తోంది. మూడు వారాలుగా రోజూ పదుల సంఖ్యలో బెదిరింపులు వస్తున్నాయి. దీంతో ఇవి అటు భద్రతా సిబ్బంది, ఇటు ప్రయాణికుల్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.

ఒక్క రోజులోనే 35:శంషాబాద్​కుబుధవారం ఉదయం 3, మంగళవారం 6 బాంబు బెదిరింపులు రాగా, ఈ నెల 22న అత్యధికంగా 35 వచ్చాయి. మొత్తంగా అక్టోబరు 1 నుంచి 30వ తేదీ వరకూ 65 బెదిరింపులు వచ్చాయి. ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్లు సైబరాబాద్‌ పోలీసులు గుర్తించారు. బెదిరింపులన్నీ ఉత్తుత్తివే అని తనిఖీల తర్వాత నిర్ధారణ అవుతున్నా, ప్రయాణికుల భద్రత దృష్ట్యా వీటిని తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి నెలకొంది. గతంలో సంవత్సరానికి ఒకటీ, రెండు బెదిరింపులు వస్తుండేవి. అయితే ప్రస్తుతం నిత్యం పదుల సంఖ్యలో బెదిరింపులు రావడం, దానికి అనుగుణంగా తనిఖీలతో విమానాలు ఆలస్యమవడంతో, దీని కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడటం నిత్యకృత్యమైపోయింది. పౌర విమానయాన శాఖ కూడా దీన్ని తీవ్రంగా పరిగణిస్తోంది.

శంషాబాద్​లో విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్‌ - నిందితుడిని గుర్తించిన పోలీసులు

లక్షల మందిపై ప్రభావం:శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఏటా 2.5 కోట్ల మంది దేశ, విదేశాలకు ప్రయాణాలు సాగిస్తున్నారు. రోజూ సగటున లక్ష మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. 450 నుంచి 500 సర్వీసులు నడుస్తున్నాయి. ప్రయాణికులకు తోడు సందర్శకుల రూపంలో కనీసం 4 లక్షల కంటే ఎక్కువ మంది వస్తుంటారు. దీంతో భారీ రద్దీ దృష్ట్యా బెదిరింపుల్ని తేలిగ్గా తీసుకోకుండా క్షుణ్నంగా తనిఖీ చేయాల్సి వస్తుండటంతో ప్రయాణాలు ఆలస్యమవుతున్నాయి. విమాన సిబ్బంది, ప్రయాణికులతో పాటు సామగ్రి మొత్తం తనిఖీ చేయాల్సి వస్తోంది.

విమానయాన సంస్థలపై భారం: గంటకు మించి ఆలస్యమైనప్పుడు విమానయాన సంస్థలు ప్రయాణికులకు ఫుడ్ ఫెసిలిటీ కల్పించాల్సి ఉంటుంది. గంటలకొద్దీ సమయం పడితే విశ్రాంతి తీసుకోవడానికి వందలాది మంది ప్రయాణికులకు హోటల్‌ రూమ్​లు సైతం ఇవ్వాల్సి వస్తోంది. మరోవైపు ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులు కనెక్టింగ్‌ ఫ్లైట్స్‌ కోసం ముంబయి, దిల్లీ వంటి నగరాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి సమయాల్లో విమానం ఆలస్యమైతే మొత్తం ప్రయాణాన్నే రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. దీనికి తోడు పైలట్లు, ఎయిర్‌ హోస్టెస్, సిబ్బందికి బస ఏర్పాటు చేయాలి.

తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేని పరిస్థితి:విమానాశ్రయ భద్రత పూర్తిగా సీఐఎస్‌ఎఫ్‌(Central Industrial Security Force) ఆధీనంలో ఉంటుంది. ప్రయాణికులు, వారి సామగ్రిని పూర్తిస్థాయిలో తనిఖీ చేశాకే లోపలికి అనుమతిస్తారు. వందలాది మంది ప్రయాణికుల భద్రత, అంతర్జాతీయంగా ముడిపడి ఉండే అంశం కావడంతో ఇటువంటి బెదిరింపులను తేలిగ్గా తీసుకోలేకపోతున్నారు. రోజూ పదుల సంఖ్యలో కాల్స్‌ వచ్చినా క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. వరుసగా వస్తున్న బెదిరింపుల వెనుక కుట్ర కోణం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు ఖలిస్థానీ పేరుతో వేర్పాటువాదుల బెదిరింపుల దృష్ట్యా ఆర్జీఐఏ (Rajiv Gandhi International Airport) పోలీసులు ఇప్పటివరకూ 8 కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అక్టోబర్​ 28, 29 తేదీలలో విశాఖలోని ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు ట్వీట్‌ పెట్టారు. బాంబు బెదిరింపు ట్వీట్‌పై ఇండిగో రీజినల్ ఆఫీస్‌ నుంచి సమాచారం వచ్చింది. బాంబుపై విశాఖ ఇండిగో ఎయిర్‌లైన్స్ స్టేషన్ మేనేజర్‌కు సమాచారం ఇచ్చారు. ఆడమ్ లామ్‌జా 202 ఐడీ నుంచి ట్వీట్ వచ్చినట్లు ఇండిగో సంస్థ వెల్లడించింది. చెన్నై-విశాఖ, బెంగళూరు-విశాఖ ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు ట్వీట్‌ వచ్చినట్లు తెలిపారు.

మంగళవారం సాయంత్రం 5 గంటల 38 నిమిషాలకు ఫోన్ కాల్ వచ్చినట్టు నిర్ధారించారు. అప్పటికే ఈ విమానాలు విశాఖలో సురక్షితంగా లాండ్ అయ్యాయి. బాంబు బెదిరింపుతో తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్న చెన్నై- విశాఖ, బెంగళూరు-విశాఖ ఇండిగో విమానాలలోని ప్రయాణీకులందరినీ దింపేసి తనిఖీలు చేపట్టారు. ఐసోలేషన్ బేకి తరలించి తనిఖీలు నిర్వహించారు. దాదాపు రెండు గంటల తర్వాత అందులో వాస్తవం లేదని అధికారులు తేల్చారు. దీని కారణంగా 5 గంటల 50 నిమిషాలకు బయలుదేరాల్సిన చెన్నై విమానం, 6 గంటల 25 నిమిషాలకు బయలుదేరాల్సిన బెంగళూరు విమానం దాదాపు రెండు గంటలకుపైగా అలస్యంగా బయలుదేరాయి.

విమానాలకు మళ్లీ బాంబు బెదిరింపులు - ప్రయాణికులను దింపేసి తనిఖీలు

ABOUT THE AUTHOR

...view details