Wooden Dolls Made in Udayagiri: 'ఉదయగిరి బొమ్మలు' ఎప్పుడైనా విన్నారా? కొండపల్లి బొమ్మలు తెలుసు, లేపాక్షి, ఏటికొప్పాక బొమ్మలు చూశాము. కానీ వీటిని ఎప్పుడూ చూడలేదే అంటారు కదా. కానీ ఉదయగిరి బొమ్మలు ఖండాంతరాలు దాటుతున్నాయని తెలుసా. వీటికి జీఐ ట్యాగ్ కూడా ఉందంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఆకట్టుకునే డిజైన్లతో కనులకు ఇంపుగా ఉండేలా చెక్కతోనే ఇంటి అలంకరణ వస్తువులు, వంటసామగ్రి, పిల్లల ఆట బొమ్మలు ముద్దుముద్దుగా ఉండే మినీయేచర్స్‌కు మహిళలే ప్రాణం పోస్తున్నారు. వీటిని ఎలా తయారుచేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
నెల్లూరు జిల్లా ఉదయగిరి వెనుకబడిన ప్రాంతం. చుట్టూ కొండలు, దట్టమైన అడవి విస్తరించి ఉంది. ఇక్కడ కావాల్సినంత కలప దొరుకుతుంది. ప్రకృతి ప్రసాదించిన వరాన్నే అబ్దుల్ బషీర్ ఆదాయ వనరుగా మార్చుకున్నారు. చెక్కపై నగిషీలు చెక్కుతూ అందమైన బొమ్మలకు ప్రాణం పోసేవారు. అప్పటి నుంచి బషీర్ కుటుంబం దీన్నే జీవనాధారంగా మార్చుకుంది. అడవిలో దొరికే కలివి, నర్ధి, బిళ్లనర్ధి, దేవదారు కర్రను తీసుకొస్తారు. కలపను మిషన్లతో కట్ చేసి కావాల్సిన ఆకృతుల్లో చెక్కుతారు. ముఖ్యంగా వంటకు ఉపయోగించే పాత్రలు, ప్లేట్లు, గరిటెలు, చెంచాలు, గ్లాసులు తయారు చేస్తారు.
కొండపల్లి, లేపాక్షి బొమ్మలు తెలుసు - మరి ప్రసిద్ధ ఉదయగిరి బొమ్మల గురించి మీకు తెలుసా? (ETV Bharat) బండెనక బండి కట్టి! - ఎద్దు లేకుండా ఐదు బండ్లు లాగిన రైతులు
10 మందితో ప్రారంభమై 400కి ఉపాధి:అంతేకాదు ఇంటి అలంకరణ సామగ్రి, దువ్వెనలు, హెయిర్ పిన్లు కూడా రూపొందిస్తారు. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు, గణిత సామర్థ్యాన్ని పెంపొందించే అబాకస్ లాంటివి కూడా తయారుచేస్తారు. వీటిలో మినీయేచర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండంతో ప్రజలు వీటికి ఫిదా అయిపోతున్నారు. ఈ కళ తనతో అంతం కాకూడదని భావించిన బషీర్ కుమార్తె గౌషియా బేగంకు నేర్పించారు. కుటుంబసభ్యులకు, గ్రామంలోని మహిళలకు ఆమె శిక్షణ ఇచ్చారు. ఉదయగిరిలోని దిలావర్ భాయ్ వీధిలో 10 మందితో ప్రారంభం కాగా ఇపుడు ఏకంగా 400 మంది మహిళలతో పరిశ్రమగా అవతరించింది. కలప తేవడం నుంచి ప్యాకింగ్ వరకు అన్ని పనులు మహిళలే చేస్తారు. ఏడాది పొడవునా ఉపాధి పొందుతూ ఆర్ధిక స్వావలంబన సాధిస్తున్నారు.
ఈ-కామర్స్‌లో దేశవిదేశాలకు:ఉదయగిరి బొమ్మలకు గిరాకీ పెరగడంతో గౌషియా బేగం కుమారుడు జాకీర్ హుసేన్ వీటిని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆన్‌లైన్ ప్లాట్ ఫామ్‌ను ఉపయోగించుకుంటూ ఈ-కామర్స్‌లో పెట్టి దేశవిదేశాలకు విక్రయిస్తున్నారు. ఉదయగిరి బొమ్మలకు జీఐ ట్యాగ్ కూడా రావడంతో వ్యాపారం విస్తరించింది. ఏడాదికి కోటికిపైగా టర్నోవర్ సాధిస్తున్నారు. మహిళల చేతి నుంచి జాలువారిన బొమ్మలు ప్రధాని మోదీని సైతం మంత్రముగ్ధుల్ని చేశాయి. మహిళల కృషిని అభినందిస్తూ ఈ నెల 26న జరిగే గణతంత్ర వేడుకల్లో గ్రూపు సభ్యులు పాల్గొనే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. ఇలా ప్రభుత్వాలు సహకారం అందిస్తే వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ నడిబొడ్డున ‘ఐటీ’కి ఐకానిక్ భవనం - 11 అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలు