AP Liquor Shops Application Process :రాష్ట్రం ప్రభుత్వం మద్యం దుకాణాలు ప్రైవేటుగా ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దీంతో వాటిని దక్కించుకోవడానికి పోటీ నెలకొంది. ఇప్పటి వరకు ఈ రంగంలో అనుభవం లేనివారు కూడా దరఖాస్తులు చేస్తున్నారు. అలాంటి వారిలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, వైద్యులు, ఆడిటర్లు, కాంట్రాక్టర్లు ఉన్నారు. స్వయంగా కార్యాలయాలకు వచ్చి దరఖాస్తు చేసే విషయమై సందేహాలు నివృత్తి చేసుకుంటున్నారని అధికారులు వెల్లడించారు.
దుకాణాల కోసం దరఖాస్తుల ప్రక్రియ :ఒక్కో మద్యం షాపునకు ప్రస్తుతం దాఖలు అవుతున్న దరఖాస్తులను పరిశీలిస్తే అంచనాలు మించి వస్తాయని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా గుంటూరు, మంగళగిరి-తాడేపల్లి, పొన్నూరు తదితర నగరాల్లో సగటున ఒక్కో షాపునకు 10కి పైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో ఎవరైతే మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు నడిపారో వారే దరఖాస్తులు చేసుకుంటారని ఎక్సైజ్ అధికారులు భావించారు. తాజాగా వస్తున్న దరఖాస్తులను చూసి ఆశ్చర్యపోతున్నారు.
మద్యం షాపులకు కొనసాగుతున్న దరఖాస్తుల ప్రక్రియ - చివరి తేదీ ఎప్పుడంటే - AP liquor shops application process
పోటెత్తుతున్న దరఖాస్తులు :గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఎక్సైజ్ యంత్రాంగం సాధ్యమైనంత ఎక్కువ మందితో దరఖాస్తులు చేయించేలా అవగాహన కల్పించారు. దరఖాస్తు రుసుముల (Fee) ద్వారా ప్రభుత్వానికి పెద్దఎత్తున ఆదాయం తెచ్చిపెట్టాలని అధికారులు యోచిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్దేశించిన బ్రాండ్లు మాత్రమే షాపుల్లో ఉండేవి. దీంతో పక్క రాష్ట్రాల నుంచి మద్యం బాగా వచ్చేంది. కానీ కూటమి ప్రభుత్వం నూతన పాలసీలో అన్ని రకాల బ్రాండ్లు, తక్కువ ధరలకే లభ్యమయ్యేలా అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఎవరైనా వచ్చి లాటరీలో షాపు దక్కించుకునేలా పారదర్శకతను తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ సారి దరఖాస్తు రుసుము 2 లక్షల రూపాయలు పెట్టి దాన్ని నాన్ రిఫండబుల్ అమౌంట్‌గా (Non-refundable amount) పేర్కొంది. దీంతో ఎవరైతే సీరియస్‌గా వ్యాపారం చేయాలని అనుకుంటున్నారో వారు మాత్రమే పోటీపడతారని ప్రభుత్వం భావించింది.దీంతో వ్యాపార నిర్వహణ సామర్థ్యం ఉన్న వ్యక్తులు వస్తారని అంచనా వేసింది.
మద్యం దుకాణాల అప్డేట్ - మూడు రోజుల్లో మూడు వేల దరఖాస్తులు - Application For AP New Liquor Shops
6 వాయిదాల్లో చెల్లింపులు : గతంలో మద్యం దుకాణాల దరఖాస్తు చేసుకోవడానికి రుసుము రూ.10 వేలు మాత్రమే ఉండేది. దీంతో ఎవరు పడితే వాళ్లు మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునేవారు. తీరా షాపు దక్కించుకున్నాక నిర్దేశిత లైసెన్సుకు కట్టాల్సిన ఫీజులు కట్టకుండా మొహం చాటేసేవారు. తిరిగి వాటికి దరఖాస్తులు స్వీకరించాల్సి పరిస్థితి. అయితే ఇప్పుడు పాలసీలో మాత్రం పట్టణ, రూరల్ ప్రాంతాల్లో వసూలు చేసే లైసెన్సు ఫీజు కూడా వేర్వేరుగా నిర్ధారించటంతో పాటు ఏ మండలంలో ఎన్ని షాపులకు పర్మిషన్లు ఇచ్చేది కూడా ముందుగానే ఎక్సైజ్ యంత్రాంగం వెల్లడించారు. దీంతో దరఖాస్తు చేసుకొనే వారికి ఒక అవగాహన ఏర్పడింది. ప్రభుత్వం నిర్ణయించిన లైసెన్సు ఫీజు చెల్లించటానికి గతంలో 3 వాయిదాలే ఉండేవి. ప్రస్తుతం దాన్ని 6 వాయిదాలకు కూటమి ప్రభుత్వం పెంచింది.
మందుబాబులకు మరో శుభవార్త - అందుబాటులో కోరుకున్న మద్యం బ్రాండ్లు! - Application For AP New Liquor Shops