Liquor Case Accused Vasudeva Reddy Deputation Extended: మద్యం కుంభకోణంలో కీలక నిందితుడు, ఐఆర్‌టీఎస్ అధికారి డి.వాసుదేవరెడ్డి డిప్యుటేషన్ పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలో ఆయన డిప్యుటేషన్‌ను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. మద్యం కేసు విచారణ జరుగుతున్నందున ఆయన్ని రాష్ట్రం నుంచి రిలీవ్ చేయకుండా, డిప్యుటేషన్‌పై కొనసాగిస్తున్నారు.
మద్యం కుంభకోణంలో విచారణ నేపథ్యంలో: ఐఆర్‌టీఎస్ అధికారిగా ఉన్న డి.వాసుదేవరెడ్డిపై జరుగుతున్న విచారణ దృష్ట్యా డిప్యుటేషన్‌పై ఏపీలో కొనసాగించేందుకు అనుమతిస్తూ రైల్వే శాఖ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో 2024 ఆగస్టు 25 నుంచి వాసుదేవరెడ్డి డిప్యుటేషన్‌ను ఆరు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈమేరకు సీఎస్ కె.విజయానంద్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మద్యం కుంభకోణం కేసులో సీఐడీ విచారణను ముమ్మరం చేసింది.
మద్యం కుంభకోణం:కాగా వైఎస్సార్సీపీ హయాంలో మద్యం సీసాలపై ముద్రించే సెక్యూరిటీ హాలోగ్రామ్‌ల తయారీ, సరఫరా టెండర్ అప్పగింత కుంభకోణంలో ఏపీఎస్‌బీసీఎల్ పూర్వపు ఎండీ వాసుదేవరెడ్డి పాత్రపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. మరోవైపు ఆయన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇటీవల జరిగిన విచారణలో వాసుదేవరెడ్డి పాత్రపై మరిన్ని ఆధారాలు లభించాయని, పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు సమయం కావాలని సీఐడీ తరఫున పీపీ ఎం.లక్ష్మీనారాయణ హైకోర్టుకు తెలిపారు. అర్హత లేని సంస్థలకు టెండర్‌లో పాల్గొనే అవకాశమిచ్చారని, ఇందుకోసం వాసుదేవరెడ్డికి భారీగా సొమ్ము ముట్టినట్లు పేర్కొన్నారు. వాస్తవాలను రాబట్టేందుకు కస్టోడీలోకి తీసుకుని విచారణ చేయాలని కోర్టుకు విన్నవించారు.