AP JAC Protest:సీఎం జగన్ ఏలుబడిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఏపీ జేఏసీ నాయకులు, ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని పంచాయతీ రాజ్ కార్యాలయం ఎటుద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. రెండో రోజు ఆందోళనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
సమస్యలపై స్పందించకపోతే - 27న చలో విజయవాడ చేపడతాం విజయవాడ పంచాయతీ రాజ్ కార్యాలయం ఎదుట ఆందోళన: ఉద్యోగుల నిరసనలో భాగంగా, రెండో రోజు భోజన విరామ సమయంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. తమ అవసరాల కోసం దాచుకున్న డబ్బులను సైతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెల్లించడం లేదని మండిపడ్డారు. తమ రక్షణ కోసం దాచుకున్న డబ్బులను చెల్లించడానికి ఉన్న ఇబ్బందులు ఏంటని ప్రశ్నించారు. సీపీఎస్ విధానాన్ని తీసుకువచ్చి ఉద్యోగులకు ప్రభుత్వం అన్యాయం చేసిందని విమర్శించారు. ఎన్నో ఆశలతో జగన్ కు ఓటు వేసి గెలిపిస్తే, తమకు అన్యాయం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమ అవసరాలకు ఉంచుకున్న డబ్బులను సైతం చెల్లించకుండా సీఎం జగన్ మోసం చేశారని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వాపోయారు. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని హామీ ఇచ్చిన సీఎం జగన్ ఆ హామీని తుంగలో తొక్కారని మండిపడ్డారు. క్రమబద్దీకరిస్తామన్న కొద్ది మంది కాంట్రాక్టు ఉద్యోగులను పూర్తి స్థాయిలో క్రమబద్ధీకరించలేదన్నారు.
22వేల కోట్ల బకాయిలు!:హెల్త్ కార్డులకు సంబందించి ఉద్యోగులు డబ్బులు కడుతున్నా, ప్రభుత్వం తరపున డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సలు చేసుకోవడానికి ఇబ్బందుల ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. 2023 జూలైలో కొత్త పీఆర్సీ కమిషనర్‌ను ఏర్పాటు చేశారని, కమిషనర్‌కు కనీసం ఒక్క ఆఫీసు కూడా ఎర్పాటు చేయలేదని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ఉద్యోగులకు సంబంధించిన, ప్రభుత్వం సుమారు 22వేల కోట్ల బకాయిలు పడిందని ఆరోపించారు. ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య ఎలాంటి గొడవ లేదని, తమకు రావాల్సిన బకాయిల కోసం గత రెండు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామని తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. తమ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరిత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
కర్నూలు కలెక్టరెేట్ ముందు నిరసన: కర్నూలు జల్లాలో ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల ఆందోళనలు రెండో రోజుకు చేరుకున్నాయి. రెండొ రోజులో భాగంగా కర్నూలు కలెక్టరేట్ వద్ద ఉద్యోగ సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సీఎం జగన్ నుమ్మి మోసపోయామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఈనెల 27వ తేదీ చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.