ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనుచిత వ్యాఖ్యలకు మద్దతుగా పిల్ వేస్తారా? - రూ.50 వేలు జరిమానా - HIGH COURT ON VIJAYA BABU PIL

అసభ్యకర, అభ్యంతర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనన్న హైకోర్టు - పిల్‌ దాఖలు చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని ఆగ్రహం

High Court Dismisses PIL Filed By Journalist Pola Vijaya Babu
High Court Dismisses PIL Filed By Journalist Pola Vijaya Babu (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 29, 2024, 7:20 AM IST

High Court Dismisses PIL Filed By Journalist Pola Vijaya Babu : సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర, అభ్యంతర పోస్టుల పెట్టిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తెలిపింది. అలాంటి వారిని సోషల్‌ మీడియా ఉద్యమకారులుగా పరిగణించలేమని స్పష్టంచేసింది. సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెడుతున్న వారిపై కేసులు నమోదు చేయకుండా నిలువరించాలని పాత్రికేయుడు విజయబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. పిల్ దాఖలు వెనుక రాజకీయ దురుద్దేశం ఉందంటూ రూ.50వేలు ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది.

రాజకీయ దురుద్దేశం ఉంది : సామాజిక మాధ్యమాల్లో అసభ్య, అభ్యంతరకర పోస్టులు పెడుతున్నవారిపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని నిలువరించాలని పాత్రికేయుడు, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన పోలా విజయబాబు పిల్‌ దాఖలు చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని హైకోర్టు స్పష్టంచేసింది. ఆయన దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేసింది. సోషల్‌ మీడియా వేదికగా అవతలి వ్యక్తులపై చేస్తున్న వ్యస్థీకృత, విష ప్రచార దాడులు చట్టాలను గౌరవించే పౌరులకు తీవ్ర నష్టం చేస్తాయని హైకోర్టు పేర్కొంది.

సోషల్ మీడియాతో జాగ్రత్త గురూ - తేడా వస్తే జైలుకే!

కఠిన చర్యలు అవసరం : దూషణలతో అసభ్యకర పోస్టులు పెట్టే వ్యక్తులను సామాజిక మాధ్యమ ఉద్యమకారులని చెప్పలేమని తెలిపింది. నచ్చినట్లు ఇష్టానుసారంగా మాట్లాడే వ్యక్తులకు సోషల్‌ మీడియా వేదికలు ఎలాంటి రక్షణ ఇవ్వలేవని హైకోర్టు పేర్కొంది. చట్టరిత్యా ఏదైతే నేరమో దాన్నిసోషల్‌ మీడియాలో చేసినా నేరమేనని తేల్చిచెప్పింది. ఇలాంటి అసభ్యకర, అభ్యంతర పోస్టులు పెట్టిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని పేర్కొంది. ముఖ్యంగా అవతలి వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని అపఖ్యాతిపాల్జేసేందుకు పనిచేసే కిరాయి మూకల విషయంలో కఠిన చర్యలు అవసరమని పేర్కొంది.

కులమతాల మధ్య విద్వేషాలు : సోషల్‌ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అభిప్రాయాలను వ్యక్తంచేసే వారికి, ఏమాత్రం మర్యాద లేకుండా అసభ్యకర పదజాలంతో దూషణలు చేస్తూ వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు, అధికారులను అపఖ్యాతిపాల్జేసేలా వేధించి, హింసించే వారికి మధ్య వ్యత్యాసం ఉందని హైకోర్టు స్పష్టంచేసింది. సోషల్‌ మీడియాను దుర్వినియోగం చేసి కులమతాలు, సమూహాల మధ్య విద్వేషాలు రేకెత్తించి సమాజంలో అశాంతిని కలిగించే అవకాశం లేకపోలేదని హైకోర్టు తెలిపింది. సమాజంలో అట్టడుగు, ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన వ్యక్తుల హక్కుల కోసం పిటిషన్‌ దాఖలు చేయలేదని పేర్కొంది.

రూ.50 వేలు జరిమాన : పోలీసుల చర్యలపై అభ్యంతరం ఉంటే పోస్టులు పెట్టినవారు చట్ట నిబంధనల మేరకు స్వయంగా పోరాటం చేసుకోవాలి తప్ప వారి తరఫున మరొకరు పిల్‌ దాఖలు చేయడానికి వీల్లేదని స్పష్టంచేసింది. కోర్టు ముందున్న రికార్డులను పరిశీలిస్తే ప్రస్తుత పిల్‌ రాజకీయ దురుద్దేశంతో దాఖలు చేసినట్లు కనిపిస్తోందని, ఈ నేపథ్యంలో దానిని కొట్టేవేస్తూ పిటిషనర్‌కు రూ.50 వేల ఖర్చులు విధిస్తున్నట్లు పేర్కొంది. ఈ సొమ్మును నెల రోజుల్లో ఏపీ న్యాయసేవాధికార సంస్థకు జమచేయాలని పిటిషనర్‌ విజయబాబును ఆదేశించింది. ఈ సొమ్మును చూపు, వినికిడి శక్తి లేని పిల్లల కోసం వినియోగించాలని న్యాయసేవాధికార సంస్థకు సూచించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈ నెల13న ఇచ్చిన తీర్పు ప్రతి తాజాగా అందుబాటులోకి వచ్చింది.

అవినాష్‌రెడ్డి పీఏ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత - 16 రోజులుగా పరారీలోనే

"ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారో?" - అజ్ఞాతంలోకి 'పులివెందుల' వైఎస్సార్సీపీ నేతలు

ABOUT THE AUTHOR

...view details