AP CID Chargesheet on Chandrababu Naidu: రాజధాని అమరావతిలో ఎసైన్డ్ భూముల కొనుగోలు ఆరోపణలతో సీఐడీ (Crime Investigation Department) 2020లో నమోదు చేసిన కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబును నిందితుడిగా పేర్కొంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ అభియోగపత్రం దాఖలు చేసింది. దానిని పరిశీలించాలని ఏసీబీ (Anti Corruption Bureau) కోర్టు ఏవోను ఆదేశిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులిచ్చారు.
ఎసైన్డ్ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ యల్లమాటి ప్రసాద్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో 2020 ఫిబ్రవరి 27న పలువురిపై సీఐడీ కేసు నమోదు చేసింది. మరోవైపు ఇదే వ్యవహారంపై నల్లూరు రవికిరణ్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా 2020 మార్చి 3వ తేదీన మరో కేసు నమోదుచేసి, పలువురిని నిందితులుగా పేర్కొంది. 2022లో మాజీమంత్రి నారాయణను నిందితుల జాబితాలో చేర్చింది. సీఐడీ కేసుల్ని రద్దు చేయాలంటూ నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ నిబంధనల్ని పాటించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అయితే ప్రస్తుతం ఈ కేసు విచారణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది.
ఫైబర్ నెట్ కేసు - అభియోగపత్రం దాఖలు చేసిన సీఐడీ
క్రైం నంబర్లు 14/2020, 15/2020 కేసులకు సంబంధించి ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టులో సోమవారం అభియోగపత్రం దాఖలు చేసింది. క్రైం నంబరు 14/2020లో చంద్రబాబును 40వ నిందితుడిగా పేర్కొంది. మరో 22 మందిని నిందితులుగా చేర్చాలని ఏసీబీ కోర్టులో సీఐడీ డీఎస్పీ మెమో దాఖలు చేశారు. చంద్రబాబుతోపాటు, నారాయణ, తుళ్లూరు మండలం అప్పటి తహశీల్దార్ సుధీర్‌బాబు, రామకృష్ణ హౌజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ అంజనీకుమార్‌ను ప్రధాన నిందితులుగా పేర్కొన్నారు.