AP CABINET TRIBUTE TO RATAN TATA : రతన్ టాటా మృతికి రాష్ట్ర మంత్రివర్గం నివాళి అర్పించింది. రతన్ టాటా మృతికి సంతాపంగా కేబినెట్‌లో సీఎం, మంత్రులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఆయన గౌరవసూచకంగా ఇతర అంశాలేవీ చర్చించకూడదని నిర్ణయించిన మంత్రివర్గం, అజెండా అంశాలపై చర్చించకుండా వాయిదా పడింది. కేబినెట్ భేటీకి ముందు రతన్ టాటా చిత్రపటానికి సీఎం చంద్రబాబు, మంత్రులు నివాళులు అర్పించారు.
రతన్ టాటా చిత్రపటానికి పూలు వేసి అంజలి ఘటించారు. రతన్ టాటా మృతి దేశానికే తీరని లోటని సీఎం చంద్రబాబు అన్నారు. విలువలతో కూడిన వ్యాపారంతో పెద్ద బ్రాండ్‌ను సృష్టించారని, అలా సృష్టించిన సంపదను అన్ని వర్గాలకు చేరేలా టాటా కృషి చేశారని తెలిపారు. కేబినెట్ వాయిదా పడ్డాక సీఎం చంద్రబాబు ముంబయి వెళ్లారు. ఆయన వెంట మంత్రి లోకేశ్ కూడా ఉన్నారు. ఇద్దరు నేతలు రతన్ టాటా భౌతికకాయానికి నివాళులు అర్పించనున్నారు.
Minister Payyavula Keshav on TATA: దేశ నిర్మాణంలో కీలక భాగస్వామి రతన్ టాటాకు గౌరవ సూచకంగా ఏపీ కేబినెట్ నివాళులు అర్పించింది. ఉప్పు నుంచి ఉక్కు దాకా ఆయన పరిశ్రమలు స్థాపించి లక్షలాది మందికి ఉపాధి కల్పించారని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఏపీ ప్రజలతోనూ ఆయనకు మంచి అనుబంధం ఉందని గుర్తు చేశారు. సామాజిక బాధ్యతగా టాటా సంస్థలు ఏపీ ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నాయన్నారు. రతన్ టాటా మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ కేబినెట్‌ను వాయిదా వేశామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.