Household Consumption Expenditure Survey-2023-24: జాతీయస్థాయిలోకుటుంబ వినియోగ వ్యయం సర్వే వివరాలను కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. దీన్ని ఓ సారి పరిశీలించినట్లయితేఆంధ్రప్రదేశ్‌లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం ఎస్టీల్లో అతి తక్కువగా ఉంది. ఈ విధంగా చూస్తే అన్ని వర్గాల ప్రజలు చేసే నెలవారీ తలసరి సగటు వ్యయం కంటే ఎస్టీ కుటుంబాల ఖర్చు గ్రామీణ ప్రాంతాల్లో 28%, పట్టణ ప్రాంతాల్లో 13% మేర తక్కువగా ఉంది.
ఆంధ్రప్రదేశ్లో సర్వే వివరాలిలా:2023 ఆగస్టు నుంచి 2024 జులై మధ్య ఈ సర్వేను నిర్వహించారు. ప్రభుత్వాలు అందించే ఉచితాలు, ఇతర సంక్షేమ పథకాలు లేకుండా ప్రజలు తమ సొంత ఆదాయ వనరులతో జాతీయ స్థాయిలో సగటున గ్రామీణ ప్రాంతాల్లో రూ.4,122, పట్టణ ప్రాంతాల్లో రూ.6,996 ఖర్చు చేస్తున్నారు. దీనితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రజలు 29.23%, పట్టణ ప్రాంతవాసులు 2.65% అధికంగా ఖర్చు చేస్తున్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే నెలవారీ తలసరి వ్యయానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఆరోస్థానం, పట్టణ ప్రాంతాల్లో ఎనిమిదో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది.
ఏపీలో రెండింటిలోనూ చివరి స్థానంలో ఎస్టీలు:జాతీయ స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ఎస్టీలు, పట్టణ ప్రాంతాల్లో ఎస్సీల వ్యయం అందరికంటే తక్కువ. కానీ ఏపీలో మాత్రం పట్టణ, గ్రామీణ ప్రాంతాలు రెండింటిలోనూ ఎస్టీలే చివరి స్థానంలో ఉన్నారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇతరులు చేసే నెలవారీ తలసరి వ్యయంతో పోలిస్తే ఓబీసీలది 5.79%, ఎస్సీలది 9.97%, ఎస్టీలది 27.17% మేర తక్కువ. అదే పట్టణ ప్రాంతాల్లో ఓబీసీలు 5.84%, ఎస్సీలు 11.36%, ఎస్టీలు 17.22% తక్కువ ఖర్చు చేస్తున్నారు.
తలసరి వ్యయాల వివరాలు: గ్రామీణ ప్రాంతాల్లో ఓబీసీలది 9.39%, ఎస్సీలది 16.45%, ఎస్టీలది 27.55% వరకు తక్కువ ఉంది. పట్టణప్రాంతాల్లో ఓబీసీలు 14%, ఎస్సీలు 26.26%, ఎస్టీలు 23% తక్కువ ఖర్చు చేస్తున్నారు. ఇతరులు-ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కుటుంబాల మధ్య నెలవారీ తలసరి వ్యయంలో జాతీయస్థాయిలో ఉన్న అంతరం కంటే ఏపీలో కొంత తక్కువగా ఉంది.