Tanguturi Prakasam Pantulu Birth Anniversary :ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా సేవలు అందించిన ప్రకాశం పంతులు 153వ జయంతి నేడు. రాజకీయాలలో ప్రకాశం పంతులు అనేక పదవులు చేపట్టారు. 1899లో రాజమహేంద్రవరంలో హేమాహేమీలను ఓడించి పురపాలిక కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. అనంతరం పురపాలక సంఘం అధ్యక్షుడిగా, మద్రాస్-సౌత్ శాసనసభ ఎన్నికల్లో, కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా పలు పదవులు చేపట్టారు. 1953 అక్టోబర్ 1న ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు ప్రమాణ స్వీకారం చేశారు.
స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకం:న్యాయవాదిగా క్షణం తీరిక లేకుండా గడిపే ప్రకాశం పంతులు మహాత్మా గాంధీ పిలుపుతో న్యాయవాద వృత్తికి స్వస్తి పలికి స్వాతంత్ర సంగ్రామం వైపు కదిలారు. ఉప్పు సత్యాగ్రహంలో కీలకపాత్ర పోషించారు. ఒంగోలు మండలం దేవరంపాడులోని తన నివాసాన్నే ఉద్యమానికి శిబిరంగా మార్చుకున్నారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు శిక్షను సైతం అనుభవించారు.
స్వరాష్ట్ర సాధన కోసం:స్వరాష్ట్ర సాధనలోనూ ప్రకాశం పంతులు కీలక పాత్ర పోషించారు. 1940లో ఏలూరు, విశాఖపట్టణం మహాసభల్లో ప్రత్యేక ఆంధ్ర ఆవశ్యకతపై ఆయన చేసిన ప్రసంగాలు తెలుగు ప్రజల హృదయాలను తాకాయి. కాంగ్రెస్ మహాసభల్లో ప్రత్యేక రాష్ట్ర తీర్మానానికి రాజగోపాలాచారి అంగీకరించకుంటే, ఈ విషయాన్ని అప్పటి జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ దృష్టికి ప్రకాశం పంతులే తీసుకెళ్లారు.
తుపాకీ గుండుకు ఎదురుగా గుండె పెట్టి పోరాడిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నిరాడంబరత, నిజాయతీ, పట్టుదల, క్రమశిక్షణ, నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతటి వారినైనా ఎదిరించడం ప్రకాశం పంతులు నైజమని ప్రశంసించారు. ప్రజా సంక్షేమమే ఊపిరిగా జీవించిన ఆంధ్రకేసరి, తెలుగువారి సాహసానికి, పౌరుషానికి ప్రతీక అని కొనియాడారు. టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా విశిష్ట వ్యక్తిత్వాన్ని, పోరాటాన్ని స్మరించుకుంటూ ఆయన స్మృతికి నివాళులు అర్పిద్దామన్నారు.
Venkaiah Naidu Comments : ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు తన సంపదనంతా ప్రజా సంక్షేమానికే ఖర్చు పెట్టిన గొప్ప నాయకుడని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రకాశం పంతులు 153వ జయంతోత్సవాలు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న టంగుటూరి విగ్రహానికి వెంకయ్యనాయుడుతో పాటు పలువురు నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. మహనీయుని జీవితం స్ఫూర్తి తీసుకొని నేటి యువత ముందుకు సాగాలని వెంకయ్యనాయుడు కోరారు. ఆనాటి ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన మేధావి అని కొనియాడారు.
టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి ఉత్సవాలను నేడు ఊరూవాడా ఘనంగా నిర్వహించారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని రాష్ట్ర కార్యక్రమంగా చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో టంగుటూరి జయంతి నిర్వహించాలని పేర్కొంది. ఈ మేరకు వివిధ శాఖల ఉన్నతాధికారులు, హెచ్‌వోడీలు, జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం మెమో జారీ చేసింది.