ACB Raids in APMDC Office Updates : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ పెద్దలు, ముఖ్యనేతలకు అడ్డగోలుగా దోచిపెట్టిన గనులశాఖ పూర్వ సంచాలకుడు వెంకటరెడ్డి తాను కూడా భారీగా లబ్ధి పొందారు. సర్వేరాళ్లను కట్ చేసేందుకు చైనా నుంచి యంత్రాలను తక్కువ ధరకు తెప్పించి, ఎక్కువ ధర పేరిట కోట్లు దోచేసేందుకు స్కెచ్ వేసిన విషయం వెలుగులోకి వచ్చింది. దీన్ని గుర్తించిన ఏసీబీ టెండర్లు మొదలు, ఏ దశలో ఏం జరిగిందో, ఎవరెవరు ఏయే పాత్ర పోషించారో తేల్చే పనిలో పడింది. అప్పట్లో పనిచేసిన అధికారులను విచారిస్తోంది.
గత ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వేలో భాగంగా, సర్వే రాళ్ల సరఫరా బాధ్యతను ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ-ఏపీఎండీసీకి అప్పగించారు. అప్పట్లో గనులశాఖ సంచాలకుడిగా, ఏపీఎండీసీ ఎండీగానూ వెంకటరెడ్డి వ్యవహరించారు. పాలిషింగ్ యూనిట్లు, గ్రానైట్ కటింగ్ యూనిట్ల నుంచి రాళ్లు సరఫరా చేయాల్సింది పోయి, సంస్థ తరఫున కటింగ్, పాలిషింగ్ యూనిట్ల ఏర్పాటుకు తహతహలాడారు. వాటిలో భారీగా డబ్బులు కొట్టేయాలని చూశారు.
బోస్‌తో కలిసి ప్రణాళిక : ఎప్పుడో మూతపడిన యూనిట్లైన చీమకుర్తిలో 10, చిత్తూరులో 10 చొప్పున 20 యంత్రాల ఏర్పాటుకు యత్నించారు. ఒక్కో యంత్రం విలువ రాజస్థాన్‌లో రూ.3 కోట్ల వరకు ఉండగా, చైనా నుంచి రూ.8 కోట్లకు కొనేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి ఏపీఎండీసీకి డిప్యుటేషన్‌పై వచ్చి, టెండర్లు, ప్రొక్యూర్‌మెంట్ విభాగం జనరల్ మేనేజర్‌గా ఉన్న బోస్‌తో కలిసి ప్రణాళిక రచించారు.
వెంకటరెడ్డి సన్నిహితుడు, విజయవాడకు చెందిన యు.కృష్ణప్రసాద్‌కు చెందిన ధన్వంతరీ అసోసియేట్స్ ద్వారా చైనా యంత్రాలు తీసుకొచ్చేందుకు చూశారు. 20 యంత్రాల కోసం రూ.160 కోట్లతో ఏపీఎండీసీ ద్వారా టెండర్లు పిలిచేందుకు సిద్ధమయ్యారు. అయితే రూ.100 కోట్ల విలువైన టెండర్లను న్యాయసమీక్షకు పంపాల్సి ఉంది. అందుకే వేర్వేరుగా 10 యంత్రాల చొప్పున రూ.80 కోట్ల అంచనా వ్యయంతో ప్రొక్యూర్‌మెంట్ విభాగం జీఎం బోస్ విడివిడిగా టెండర్లు పిలిచారు. ఈ టెండర్ ధన్వంతరీ అసోసియేట్స్‌కే దక్కేలా పనులు చక్కబెట్టారు.
Mines Venkata Reddy Irregularities : వాస్తవానికి ధన్వంతరీ అసోసియేట్స్ వైద్య పరికరాల సరఫరాదారు. దానికి గ్రానైట్ యంత్రాలపై అనుభవం లేదు. అయినా వెంకటరెడ్డి పట్టించుకోలేదు. అప్పటి ఏపీఎండీసీ ఫైనాన్స్ విభాగం, మైనింగ్ అధికారులు, సలహాదారులు సహా అందరూ ధన్వంతరీ ద్వారా చైనా యంత్రాలు తీసుకోవద్దని అభ్యంతరం చెప్పారు. అయినా వెంకటరెడ్డి పట్టించుకోకుండా, బోస్‌తో కలిసి ముందడుగు వేశారు.
అడ్వాన్స్‌గా రూ.30 కోట్లు ఇచ్చేలా ఒత్తిళ్లు : టెండర్లలో బిడ్ దక్కించుకున్న ధన్వంతరీ అసోసియేట్స్ రూ.26 లక్షలు బ్యాంక్ గ్యారంటీగా చెల్లించింది. తర్వాత 20 శాతం మేర అంటే రూ.30 కోట్ల వరకు అడ్వాన్స్‌గా చెల్లించాలంటూ వెంకటరెడ్డి ఒత్తిడి చేశారు. దీనికి ఫైనాన్స్ విభాగం అడ్డుచెప్పింది. ఈ ఫైలుపై ఏపీఎండీసీ బోర్డు భేటీ కాగా, చైనా యంత్రాల కొనుగోలుకు ఏపీ సర్కార్ అనుమతి తీసుకోవాలని తీర్మానించారు.
దీంతో దస్త్రాన్ని గనులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వద్దకు పంపారు. అప్పటికే ఈ వ్యవహారంపై ఆయనకు ఫిర్యాదులు అందటం, ఈ టెండర్లలో వెంకటరెడ్డి జోక్యం చేసుకున్నట్లు తేలడంతో, వీటి కొనుగోలుకి అనుమతివ్వలేదు. ఈ వ్యవహారంపై ఆగ్రహించిన వెంకటరెడ్డి ప్రొక్యూర్‌మెంట్ జీఎం బోస్‌ను బాధ్యుడిని చేసి, ఆయన డిప్యుటేషన్ రద్దు చేయించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు పంపించారు. వెంకటరెడ్డిపై చర్యలు లేకుండా సీఎంఓలోని అధికారి చక్రం తిప్పారు.