ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"వాట్ ఈజ్ దిస్ వెంకట్​రెడ్డీ?" కోటి కూడా లేని కంపెనీకి 160కోట్ల కాంట్రాక్ట్ - కటింగ్ పేరిట కోట్లు కొట్టేసే స్కెచ్! - ACB INQUIRY ON VENKATA REDDY

చైనా యంత్రాల వ్యవహారంపై ఏసీబీ అధికారుల ప్రాథమిక విచారణ

ACB Inquiry on Venkata Reddy
ACB Inquiry on Venkata Reddy (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 30, 2024, 12:42 PM IST

ACB Inquiry on Venkata Reddy :కోట్ల రూపాయల టెండర్ దక్కించుకోవాలంటే ఏ సంస్థకైనా తగిన అర్హతలుండాలి. దాని టర్నోవర్‌ కూడా అంతకంటే ఎక్కువే ఉండాలి. కానీ మైనింగ్‌ ఘనుడు వెంకటరెడ్డి ఇవన్నీ తోసిరాజని కోటి వార్షిక టర్నోవర్‌ కూడా లేని సంస్థకు ఏకంగా రూ.160 కోట్ల విలువైన టెండర్​ను అప్పగించి, పెద్ద ఎత్తున సొమ్ము కొట్టేసేందుకు వ్యూహం పన్నారు. సర్వేరాళ్ల కటింగ్, పాలిషింగ్‌ కోసం అధిక ధరతో చైనా యంత్రాలను కొనేందుకు ఏపీఎండీసీ పూర్వపు ఎండీ వెంకటరెడ్డి చేసిన బాగోతంపై అవినీతి నిరోధకశాఖ విచారణలో ఆసక్తికరమైన అంశాలెన్నో వెలుగు చూస్తున్నాయి.

అడ్డగోలుగా చెల్లింపులు చేయాలంటూ వెంకటరెడ్డి హుకుం జారీ చేస్తే కుదరదని అడ్డుచెప్పిన అధికారులపై ఆయన వీరంగమాడారు. రూ.3 కోట్లకు లభించే ఒక్కో చైనా యంత్రాన్ని రూ.8 కోట్లకు కొనుగోలు చేయాలని భావించారు. రెండు విడతల్లో మొత్తం 20 యంత్రాల కోసం టెండర్లు పిలిచారు. ఇందులో భాగంగా వెంకటరెడ్డికి సన్నిహితుడైన కృష్ణప్రసాద్‌కు చెందిన ధన్వంతరీ అసోసియేట్స్‌తోపాటు, మరో సంస్థతో బిడ్లు దాఖలు చేయించారు. ధన్వంతరికే టెండర్ కట్టబెట్టడమే కాకుండా నిర్వహణ కూడా ఆ సంస్థే చూసేలా, అందుకు మరింత చెల్లించేలా ఏర్పాట్లు చేశారు.

Mines Venkata Reddy Irregularities : ధన్వంతరీ అసోసియేట్స్‌ వైద్య పరికరాలు సరఫరా చేసే చిన్న సంస్థ. దాని వార్షిక టర్నోవర్‌ కోటి కూడా ఉండదు. టెండర్లలో దానికి సాంకేతిక, ఆర్థిక అర్హతల్లేవని అధికారులు గుర్తించారు. అయినా వెంకటరెడ్డి ఒత్తిడితో ఆ సంస్థకే టెండర్ దక్కింది. చైనాలో ఓ కంపెనీ ఆ యంత్రాలను ధన్వంతరికి సరఫరా చేస్తే, అది ఏపీఎండీసీకి అందజేస్తుంది. చైనా కంపెనీ ఇచ్చే ఇన్వాయిస్‌ కాకుండా, ధన్వంతరి సంస్థకు చెందిన ఇన్వాయిస్‌ సమర్పించేలా అవకాశం కల్పించారు.

చైనా కంపెనీ ఎంత ధరకు ఆ యంత్రాలు అమ్మిందో తెలియకుండా దాచేందుకు చూశారు. ఆ యంత్రాలకు చైనా కంపెనీ గ్యారంటీ ఇవ్వబోమని స్పష్టంగా చెబితే ఎటువంటి సాంకేతిక అర్హత లేని ధన్వంతరి అసోసియేట్స్‌ మాత్రం గ్యారంటీ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఇవన్నీ నిబంధనలకు విరుద్ధమని, ఈ టెండర్లు ఖరారు చేయొద్దని ఏపీఎండీసీలో అన్ని విభాగాల అధికారులు ముక్తకంఠంతో చెప్పారు. వెంకటరెడ్డి ఇవేమీ పట్టించుకోకుండా, టెండర్ కట్టబెట్టి, దానితో ఒప్పందం కూడా చేసుకున్నారు. ఇందుకు ప్రొక్యూర్‌మెంట్‌ విభాగం జీఎం బోస్‌ అంతా తానై నడిపించారు. కొందరు అధికారులు ఈ బాగోతాన్ని గనులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు చైనా నుంచి యంత్రాలు తెచ్చేందుకు అనుమతివ్వాలంటూ దస్త్రాన్ని వెంకటరెడ్డి ప్రభుత్వానికి పంపారు.

అధికారులపై ఒత్తిడి తెచ్చిన వెంకటరెడ్డి : విదేశీ యంత్రాలు తెప్పించాలనుకున్నప్పుడు గ్లోబల్‌ టెండర్లు ఎందుకు పిలవలేదు? ధన్వంతరి సంస్థకు అర్హతలు ఉన్నాయా వంటి అనేక ప్రశ్నలతో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆ దస్త్రాన్ని ఆపేశారు. తర్వాత కొద్దిరోజులకే ధన్వంతరీ అసోసియేట్స్‌ అధిపతి కృష్ణప్రసాద్‌ కొత్త డ్రామాకు తెరలేపారు. తాను చైనా నుంచి రెండు యంత్రాలు కొని తెచ్చేశానని, అవి కంటెయినర్‌లో చెన్నై నౌకాశ్రయానికి చేరుకున్నాయని చెప్పారు. రెండింటికి రూ.16 కోట్లు చెల్లించాలని కోరారు. జాప్యమయ్యే కొద్దీ అదనపు ఛార్జీలు పడతాయని అంటూ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇందుకు వంత పాడిన వెంకటరెడ్డి తొలుత రూ.16 కోట్లు ఇచ్చేయండని అధికారులను ఆదేశించారు.

అయితే అధికారులు ధన్వంతరితో జరిగిన ఒప్పంద కాపీలను బయటకు తీశారు. అందులో ఏపీఎండీసీ అడ్వాన్స్‌ ఇచ్చాక, గుత్తేదారు యంత్రాలు కొని, తేవాలని ఉందని చూపించారు. అడ్వాన్స్‌ ఇవ్వకుండానే యంత్రాలు ఎలా తెచ్చారని నిలదీశారు. చెల్లింపులు చేయబోమని ఎదురుతిరిగారు. దీంతో ఆ అధికారులందరిపై వెంకటరెడ్డి చిందులు తొక్కారు. అప్పటి వరకు చైనా నుంచి యంత్రాలు వచ్చేశాయని గగ్గోలు పట్టిన కృష్ణప్రసాద్‌ తర్వాత కిక్కురుమనలేదు. ఇంతలో ఎన్నికల కోడ్‌ వచ్చింది. ఈ క్రమంలోనే ధన్వంతరి సంస్థకు చెందిన బ్యాంక్‌ గ్యారంటీ రూ.26 లక్షలు వెనక్కి ఇచ్చేశారు.

చైనా యంత్రాల వ్యవహారంపై ఏసీబీ :కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీఎండీసీ ఎండీగా వెంకటరెడ్డిని తప్పించి, ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌ను నియమించింది. ధన్వంతరి దస్త్రం ఆయన వద్దకు వచ్చింది. అందులో బ్యాంక్‌ గ్యారంటీ తిరిగి ఇచ్చేసినట్లు ఉండటాన్ని ఆయన గుర్తించారు. ఆ సంస్థతో ఒప్పందం రద్దు కాకుండానే, బ్యాంక్‌ గ్యారంటీ ఎలా వెనక్కి ఇచ్చారంటూ సంబంధిత అసిస్టెంట్‌ మేనేజర్‌ సంతోష్‌కు తాఖీదు జారీ చేశారు. తర్వాత లోతుగా పరిశీలిస్తే మొత్తం వ్యవహారం బయటకు వచ్చినట్లు సమాచారం. దీంతో ఏసీబీ అధికారులు ఈ చైనా యంత్రాల వ్యవహారంపై ప్రాథమిక విచారణ జరుపుతున్నారు. వెంకటరెడ్డిని విచారించేందుకు ప్రభుత్వ అనుమతి కూడా తీసుకున్నారు. తగిన ఆధారాలతో వారంలో దీనిపై కేసు నమోదు చేయనున్నట్లు తెలిసింది.

వెంకటరెడ్డి చర్యలతో రూ.2,566 కోట్ల నష్టం - రిమాండ్‌ రిపోర్టుని న్యాయస్థానానికి సమర్పించిన ఏసీబీ - Venkata Reddy Remand Report

వైఎస్సార్సీపీ ఇసుక దోపిడీకి వెంకటరెడ్డి సహకారం - జేపీ పవర్‌ వెంచర్స్‌కు 6 నెలల గడువు పొడిగింపు - JP Company Sand Mining Deadline

ABOUT THE AUTHOR

...view details