YSRCP Rebel MLAs Petition in High Court: తమపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ వద్ద విచారణకు హాజరు కావాలని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు నిర్ణయిస్తూ ప్రకటించిన కాసేపటికే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. స్పీకర్ నోటీసును సవాల్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యేల హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో ఈ అంశం మరిన్ని మలుపులు తీసుకోనుంది.
విచారణకు హాజరు కాలేను: మరోవైపు ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య సైతం మండలి ఛైర్మన్ నోటీసును సవాల్ చేశారు. తనపై దాఖలైన అనర్హత పిటిషన్‌పై శాసన మండలి ఛైర్మన్ ఎదుట విచారణకు హాజరు కాకూడదని వైసీపీ రెబెల్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మండలి ఛైర్మన్ నోటీసులను సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశామని మండలి ఛైర్మన్‌కు న్యాయవాది ద్వారా రామచంద్రయ్య లేఖ పంపారు. లంచ్ మోషన్ పిటిషన్ మధ్యాహ్నం విచారణకు వస్తున్నందున్న తాను హాజరు కావడానికి నెల రోజుల సమయం కావాలని లేఖలో కోరారు. హైకోర్టులో ఇరువైపులా వాదనలు పూర్తి అయ్యాయి. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం తెలిపింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 26కు వాయిదా వేసింది.
తెలుగుదేశం, వైఎస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌లపై నేడు స్పీకర్ విచారణ
స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యేల స్పందన:ఏపీలో స్పీకర్ రూల్ బుక్‌ను కూడా విభజించారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం చివరి రోజుల్లోనైనా చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. వైఎస్సార్సీపీలో తనకంటే చాలామంది జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆయన వివరించారు. సమయం ఇవ్వాలని స్పీకర్‌ను కోరినట్లు ఆయన ఇంతకు ముందే ప్రకటించారు. కానీ స్పీకర్ అందుకు నిరాకరించినట్లు శ్రీధర్‌రెడ్డి తెలిపారు. స్పీకర్‌ను కలిశాక దీనిపై మరిన్ని వివరాలు అందిస్తామని కోటంరెడ్డి పేర్కొన్నారు.
మాకు స్పీకర్ సమయమివ్వలేదు: విచారణ అంతా ఒక ప్రహసనంగా ఉందని ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. తనపై ఫిర్యాదు చేసిన ప్రసాద్‌రాజు కూడా విచారణలో ఉండాలని కోరినట్లు ఆయన తెలిపారు. ఒరిజనల్ సీడీలు, పేపర్ క్లిప్పింగ్‌లు, డాక్యుమెంట్లు కావాలని అడిగినట్లు గుర్తు చేశారు. ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవాల్సిన అవసరం లేదని స్పీకర్ చెప్పారన్నారు. తమ వాదన వినిపించడానికి 4 వారాల సమయం అడిగినట్లు ఆనం వెల్లడించారు. న్యాయవాదిని నియమించుకోవడానికి అవకాశం ఇవ్వాలని లేఖ ద్వారా కోరగా, న్యాయవాదిని నియమించుకోవడానికి కూడా స్పీకర్ సమయమివ్వలేమని ఆనం ఆరోపించారు.
రెబల్ అభ్యర్థులతో ప్రధాన పార్టీల సంప్రదింపులు - ఎన్నికల బరిలో లేకుండా బుజ్జగింపులు
రహస్య ఓటింగ్‌లో విప్ ఉల్లంఘించామని ఎలా చెబుతారు: తన అనారోగ్యంపై వైద్యులు నివేదికిచ్చినా స్పీకర్ పట్టించుకోలేదని మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. స్పీకర్‌ను కలిసి మళ్లీ సమయం కోరతానని చెప్పారు. విప్ ఉల్లంఘించామనడానికి వాళ్ల వద్ద ఉన్న ఆధారాలేమిటి అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ ఉల్లంఘించామని ఎలా నిర్ధారించారని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.
రహస్య ఓటింగ్‌లో విప్ ఉల్లంఘించామని ఎలా చెబుతారని నిలదీశారు. అధికారం అండ ఉంటే ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నారని ధ్వజమెత్తారు. వైసీపీలో రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు, రాజీనామా చేయని ఎమ్మెల్యేలు కూడా జగన్‌ని విమర్శిస్తున్నారని గుర్తుచేశారు. అన్ని రకాలుగా విమర్శలు ఎదుర్కొనే గొప్ప సీఎం ఇంకెవరైనా ఉంటారా అని మండిపడ్డారు.