TDP Leaders Comments on YS Jagan:విధ్వంసకారుడే విధ్వంసం గురించి నిర్వచనం చెప్పడం ఈ శతాబ్దపు విడ్డూరమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. దుష్టపాలన, తుగ్లక్ పాలనకు ఉదాహరణగా జగన్ పాలన అని ప్రజలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. జగన్ 5 ఏళ్ల రివర్స్ పాలన చూసి దేశంలోని రాష్ట్రాలతో పాటు ప్రపంచ దేశాలూ నివ్వెరపోయాయని ధ్వజమెత్తారు. జగన్ నిర్లక్ష్యంతో పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్దకమైందని, ఢయాప్రం వాల్ కొట్టుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రుల జీవనాడి పోలవరం ఎత్తును 41.15 మీటర్లని చెప్పి అణువణువునా అన్యాయం చేసింది జగనే అని మంత్రి మండిపడ్డారు. జగన్ పాలనలో అన్ని రంగాల ప్రగతి అథఃపాతాళానికి పడిపోయాయని దుయ్యబట్టారు. జగన్ అరాచక పాలనలో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని విమర్శించారు. ఘోర పరాజయానికి, రాజకీయ పతనానికి జగన్ కారణాలు విశ్లేషించుకోవాలని హితవు పలికారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, పాలనా పరిపక్వత ఉన్న చంద్రబాబుపై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. చంద్రబాబు, పవన్, మోదీ కలయిక విజయం ప్రజల నిర్ణయమని మంత్రి నిమ్మల అన్నారు.