Police Searching for YSRCP Leader Varra Ravinder Reddy:పులివెందులకు చెందిన వైఎస్సార్సీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త, సోషల్ మీడియా సైకోగా పేరొందిన వర్రా రవీందర్‌రెడ్డి కోసం వైఎస్సార్ జిల్లా పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతోంది. 4 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వర్ర రవీందర్ రెడ్డి ఆచూకీ కోసం యత్నిస్తున్నాయి. కమలాపురం, పులివెందులతో పాటు హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలకు పోలీసు బృందాలు వెళ్లాయి. వర్రా రవీందర్‌రెడ్డి వాడే 2 ఫోన్లూ స్విచ్చాఫ్‌లో ఉన్నాయని అతనిపై అన్ని రకాలుగా నిఘా పెట్టామని పోలీసులు తెలిపారు. రెండు రోజుల కిందట పోలీసుల నిర్లక్ష్యంతో పరారైన రవీందర్ రెడ్డిని పట్టుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు రావడంతో అతనికోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
వర్రా రవీందర్‌రెడ్డి సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అనిత, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, జగన్ తల్లి విజయమ్మ, మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీతపై సోషల్ మీడియాలో అత్యంత హేయంగా, జుగుప్సాకరంగా పోస్టులు పెట్టారు. గత ఐదేళ్లుగా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న రవీందర్ రెడ్డిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం వెనుకేసుకొచ్చింది. దీంతో ఆయనపై మంగళగిరి, హైదరాబాద్‌లో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు వర్రా రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని కడప పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం వర్రా రవీందర్‌రెడ్డిని పోలీసులు వదిలేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనిపై సీఎం చంద్రబాబు, డీజీపీ ద్వారకా తిరుమలరావు తీవ్రంగా స్పందించారు.