Pawan Kalyan Meeting With East Godavari Janasena Leaders :ప్రజల్లో జనసేనపై అభిమానం ఉందని దాన్ని ఓటుగా మార్చేందుకు ఈ క్షణం నుంచే పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆ పార్టీ శ్రేణులకు సూచించారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున అంతా ఐక్యంగా ముందుకెళ్లాలని జనసైనికులకు దిశానిర్దేశం చేశారు. అప్రజాస్వామిక, ఫ్యాక్షన్ ధోరణితో వెళ్తున్న సీఎం జగన్‌ను అడ్డుకోవాలంటే తెలుగుదేశానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని తూర్పుగోదావరి జిల్లా నేతలకు స్పష్టం చేశారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, అనపర్తి, రాజానగరం నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు, ముఖ్య నాయకులతో పవన్ సమావేశమయ్యారు. జనసేనను స్థాపించిన తరవాత పార్టీని ఈ స్థాయికి తెచ్చే క్రమంలో ఎదుర్కొన్న ఆటుపోట్లు, అవమానాల గురించి వివరించారు. జనసేన ఒంటరిగా పోటీ చేయాలని, ఎక్కువ స్థానాలు డిమాండ్ చేయాలని అనేక సూచనలు వస్తున్నాయన్న పవన్ అలా చేస్తే 40 స్థానాల్లో గెలిచే బలం జనసేనకు ఉందన్నారు. అందుకు సమర్థ ఎలక్షనీరింగ్ చేసే అభ్యర్థులు ఉండాలని ఎక్కువ స్థానాలు డిమాండ్ చేసి తీసుకుని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే వైసీపీకి లబ్ధి చేకూరుతుందని నేతలకు వివరించారు. మరో దఫా వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అస్తవ్యస్తమవుతుందన్న పవన్ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తెలుగుదేశంతో పొత్తు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఆ క్రమంలోనే సీట్ల సర్దుబాటు ఉంటుందని ఓట్ల బదిలీ కచ్చితంగా జరగాలని సూచించారు.
నియోజకవర్గ ఇన్చార్జిలతో పవన్ సమావేశం- పొత్తులు, పోటీపై స్పష్టత!
ఎక్కువ స్థానాలు ఆశించడం కంటే ఉమ్మడి అభ్యర్థుల విజయానికి సంపూర్ణంగా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. కాపుల ప్రాబల్యమున్న తూర్పు గోదావరి జిల్లాలో ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్ర చేసినప్పుడు కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని ప్రకటించారని పవన్ గుర్తు చేశారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో ఈ సామాజికవర్గానికి ఉన్న 5 శాతం రిజర్వేషన్ తొలగించారని దీనివల్ల విద్య, ఇతర అవకాశాల పరంగా నష్టపోవాల్సి వచ్చిందన్నారు. గోదావరి జిల్లాల్లో మిథున్‌రెడ్డి, పెద్దిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఆధిపత్యం చెలాయిస్తూ చిచ్చు రేపుతున్నారని పచ్చని కోనసీమలో కుంపటి రగిలించి చిచ్చు పెట్టారని విమర్శించారు. ప్రభుత్వ ధోరణి వల్ల ఐటీ, పరిశ్రమలు రాష్ట్రానికి రాలేదన్న పవన్ వైసీపీ అరాచకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు.