Minister Nara Lokesh Fire On YS Jagan:ప్రభుత్వంపైతప్పుడు ప్రచారాలు, ఆరోపణలు చేస్తే సాక్షి ఎడిటర్‌తో పాటు జగన్‌పై కూడా కఠిన చర్యలుంటాయని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ హెచ్చరించారు. వరద సహాయక చర్యల్లో బాధితులకు అందించిన భోజనాలకు రూ.139.75 కోట్లు ఖర్చు అయిందని కూటమి ప్రభుత్వం ప్రకటిస్తే దానిని రూ.368 కోట్లు అని జగన్ అబద్ధం చెప్తున్నాడని మండిపడ్డారు. కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.23 లక్షలు ఖర్చు చేస్తే రూ.23 కోట్లు అంటూ ఫేక్ బుద్ధితో ఫేక్ లెక్క చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల సొమ్ము 12.85 కోట్లతో ఇనుప ఫెన్సింగ్ వేసుకున్న తాడేపల్లి ప్యాలెస్‌లో నాలుగు గోడల మధ్య లేదంటే అవినీతి సామ్రాజ్యం అడ్డా అయిన యలహంకా ప్యాలెస్‌లో జగన్ నిద్రపోతాడని దుయ్యబట్టారు. వరద బాధితులకు ఏ భోజనం, ఎక్కడ పెట్టాం, వరద సహాయక శిబిరాలు ఎక్కడ ఏర్పాటు చేశామో ఇంట్లో ఉన్న ఫేక్ జగన్‌కు ఎలా తెలుస్తుందని అన్నారు. జగన్‌ని ఎద్దేవా చేస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్(X) ఖాతాలో మంత్రి లోకేశ్ పోస్ట్ చేశారు.
Minister Nara Lokesh Comments :ప్రజా కోర్టులో ఎన్డీఏ ప్రభుత్వం గెలిచిందని, పరువు నష్టం కేసు కూడా గెలుస్తామని ఆశిస్తున్నామని శుక్రవారం విశాఖలో మంత్రి నారా లోకేశ్ అన్నారు. తనపై అసత్య కథనాలు ప్రచురించిన సాక్షి మీడియాపై 75 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసిన లోకేశ్ విశాఖ కోర్టుకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పరువు నష్టం కేసు గెలుస్తామని ఆశిస్తున్నామని తెలిపారు. బ్లూ మీడియాలో ఎలాంటి మార్పు రాలేదని, తప్పుడు వార్తలు వేస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై చేసిన ఒక్క ఆరోపణ కూడా రుజువు చేయలేకపోయారని, అందుకే 2024లో ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారని అన్నారు. ఇప్పటికైనా సాక్షి వైఖరి మార్చుకుని వాస్తవాలు చెప్పాలని హితవు పలికారు. దుష్ప్రచారం చేసి తప్పుడు రాతలు రాస్తే ప్రభుత్వ వదలదని హెచ్చరించారు. ప్రజలు తమ కుటుంబాన్ని దీవించి ఆరుసార్లు అవకాశమిచ్చారని, ప్రజలు ఇచ్చిన అవకాశాలను సేవ చేసేందుకు వినియోగించామన్నారు.