Murthy Yadav on Visakha Dairy : విశాఖ డెయిరీని ఆ సంస్థ ఛైర్మన్ ఆడారి ఆనంద్ కుటుంబం దోచుకుంటోందని జనసేన కార్పొరేటర్ మూర్తియాదవ్ ఆరోపించారు. వెంటనే ఆ సంస్థ పాలకవర్గాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా లాభాల్లో ఉన్న లాభాల్లో ఉన్న విశాఖ డెయిరీ మొదటిసారి నష్టాల్లోకి వెళ్లిందని విమర్శించారు. మరి కొద్దీ రోజుల్లో కనీసం ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి చేరుకుంటోందని వాపోయారు. విశాఖ పబ్లిక్ లైబ్రరీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
మూడు లక్షల మంది పాడి రైతుల కష్టాన్ని ఆడారి ఆనంద్ దోచుకుంటున్నారని మూర్తియాదవ్ ఆరోపించారు. వారి సంక్షేమం కోసం వంద కోట్ల రూపాయలతో కట్టిన ఆసుపత్రిని కారు చౌకగా సతీశ్ అనే వ్యక్తి లీజుకు ఇచ్చారని విమర్శించారు. రాయల్ లైన్ బ్రాండ్ , నార్త్ పోల్ ఐస్ క్రీమ్ పేరిట అక్రమాలకు పాల్పడ్డారని ఆక్షేపించారు. విశాఖ డెయిరీ ఆస్తులను కొట్టేశారని ధ్వజమెత్తారు. డెయిరీ పాలకవర్గం సభ్యులపై ఈడీ, సీబీఐలతో విచారణ చేయించాలని మూర్తియాదవ్ ప్రభుత్వాన్ని కోరారు.
"డెయిరీ ఆస్తుల్లో ఏలమంచలి సమీపంలో కోకిరాపల్లిలో 20 ఎకరాల భూమిని కొట్టేశారు. విశాఖ డైరీ ఎండీ, సీఈఓ ఎస్వీ రమణ జీతం నెలకు 9 లక్షలు, పీఎఫ్ రూ.1.20 లక్షలు కలిపి రూ.10.20 లక్షలు జీత భత్యంగా తీసుకుంటున్నారు. జీఎంగా ఉన్న విశ్రాంత ఉద్యోగికి నెలకు మూడున్నర లక్షలకు పైగా చెలిస్తున్నారు. డైరెక్టర్లు, డిస్ట్రిబ్యూటర్గా మారి దోచుకుంటున్నారు. స్కిల్ డెవలప్మెంట్ పేరిట రూ.25 కోట్లు ఖర్చు చేసినట్టు చూపించారు. గత ఎన్నికల్లో ఆ నిధులను ఖర్చు చేశారు."- మూర్తియాదవ్, జనసేన కార్పొరేటర్