Gongura Mutton Recipe in Telugu : పంచభక్ష్య పరమాన్నాలు, చిత్రాన్నాలు, మధురసాలు, ఫలరసాలు, పాయసాలు, పానీయాలు, కూరగాయలు ఇలా ఎన్ని ఉన్నా నాగరికుల విందు భోజనంలో ముఖ్యమైన పదార్థం గోంగూర అని సెలవిచ్చారు మనవాళ్లు. శాకంబరి దేవి ప్రసాదం, ఆంధ్ర శాకం అంటూ గోంగూర ప్రాధాన్యాన్ని వివరించారు. అలాంటి గోంగూరతో మటన్ కలిపి వండితే ఆ మజానే వేరు. ఊహించుకుంటేనే లాలాజలం ఊరిస్తోంది కదా? అయితే, ఇంకెందుకు ఆలస్యం! గోంగూర మటన్ ఎలా వండాలో తెలుసుకుందామా!
కేరళ స్టైల్లో కోడిగుడ్డు కర్రీ - కొబ్బరి పాల గ్రేవీతో సూపర్ టేస్ట్
తెలుగు రాష్ట్రాల్లో గోంగూర మటన్ సుప్రసిద్ధ వంటకం. వివాహాది శుభకార్యాల్లో ఇది తప్పనిసరి. ఈ గోంగూర మటన్ చేయడం తేలికైనా, అందులో వాడే మసాలాలు, మాంసం, సరైన మోతాదులో ఉప్పు కారాలుంటేనే రుచి. ఇవాళ గుంటూరు స్టైల్ గోంగూర మటన్ చేసేద్దాం.
హోటళ్లు, రెస్టారెంట్లలో గోంగూర, మటన్ వేర్వేరుగా ఉడికించి పెట్టుకుంటారు. ఆర్డర్ రాగానే ఉప్పు, కారం తగిలించి వేడి చేసి తెచ్చేస్తారు. కానీ, అసలు సిసలైన గోంగూర మటన్ గుంటూరు స్టైల్లో చేస్తేనే రుచి.
చిట్కాలు
- మటన్ గోంగూర కర్రీ కోసం లేత ఎముకలతో ఉన్న లేత మాసం ఎంచుకోవాలి.
- మాంసాహారంలో నూనె కాస్త ఎక్కువగానే పడుతుంది.
- బాగా కడిగి పెట్టుకున్న ఎర్ర గోంగూర వాడుకుంటే మంచి రుచి వస్తుంది.
- మాంసం చక్కగా కుక్ కావడానికి మీడియం ఫ్లేమ్‌లో వండుకోవాలి.
మసాలా పొడి కోసం:
- ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు
- జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
- దాల్చిన చెక్క - రెండు ఇంచులు
- లవంగాలు - 5
- మిరియాలు - 1 టేబుల్ స్పూన్
- ఎండు మిర్చి - 5
- వెల్లుల్లి - 13
నానబెట్టడాలు, మిక్సీ పట్టడాల్లేవ్! - 10 నిమిషాల్లో కరకరలాడే రవ్వ పునుగులు
కూర కోసం
- నూనె - అర కప్పు
- మాంసం - అర కిలో
- ఎర్ర గోంగూర - పావు కిలో
- ఉప్పు - తగినంత
- కారం - 2 టేబుల్ స్పూన్లు
- కరివేపాకు - ఒక రెబ్బ
- ఉల్లిపాయలు - మీడియం సైజువి 2
- అల్లం వెల్లులి ముద్ద - 2 టేబుల్ స్పూన్లు
- పసుపు - పావు టేబుల్ స్పూన్
- వెల్లులి తరుగు - 3 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం ఇలా :
- ముందుగా మూకుడులో కప్పు నూనె పోసుకుని అందులో ఉల్లిపాయ తరుగు, అల్లం వెల్లులి ముద్ద వేసుకోవాలి. కాస్త వేగాక పసుపు కలిపిన మాంసం కూడా వేసుకుని నీళ్లు, కారం, ఉప్పు వేసి మాధ్యమధ్యన కలుపుతూ మాంసం మెత్తగా ఉడికించుకోవాలి.
- మరోవైపు మసాలా పొడి ఆయా పదార్థాలను సన్నని సెగ మీద సువాసన వచ్చే దాకా వేపుకోవాలి. చివరలో పొట్టు తీసిన వెల్లుల్లి వేసి కలిపి మిక్సీలో వేసి మెత్తని పొడి చేసుకోవాలి.
- మాంసం మెత్తగా ఉడికినా సరే కొంచెం గ్రేవీ కనిపిస్తుంది. అప్పుడు మిగిలిన నూనె, ఎర్ర గోంగూర వేసి ఆకు మెత్తబడే దాకా కలుపుకోవాలి.
- వెల్లుల్లి తరుగు, మాంసం మసాలా కారం పొడి వేసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద నూనె పైకి తేలేదాక ఉడికించుకుంటే సరి.
పులుసు ఇలా పెట్టి చూడండి - చేపలంటే నచ్చని వాళ్లు కూడా ఇష్టంగా తింటారు!
వీకెండ్ రెసిపీ : రాయలసీమ స్టైల్ మటన్ ఫ్రై - సింపుల్ టిప్స్‌తో ఇలా చేసుకోండి