జ్ఞాపకాలు.. ఎవరికైనా మధురాలే. రతన్ టాటా వంటి దిగ్గజ పారిశ్రామికవేత్త కూడా ఇందుకు అతీతులు కారు. 81 ఏళ్ల తన జీవిత పుస్తకంలో కొన్ని పేజీలను గురువారం తిరగేశారు. తన గురువు, స్నేహితుడు జహంగీర్ రతన్‌జీ దాదాభాయ్(జేఆర్‌డీ) టాటా 117వ జయంతి సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో వాటిని పంచుకున్నారు.
'జేఆర్‌డీ కలల్లో ఒకటి టాటా కారును ఆవిష్కరించడం. ఆయన సంకల్పం నెరవేర్చడంలో ఆర్కిటెక్ట్ సుమంత్ మూల్గావ్‌కర్ భాగమే. జేఆర్‌డీ కలను టెల్కో నెరవేర్చింది' అంటూ పుణె ప్లాంటులో టాటా ఎస్టీమ్ కారు విడుదల సందర్భంగా జేఆర్‌డీతో కలిసి తీసుకున్న ఫొటోను రతన్ టాటా షేర్ చేశారు. 1991లో టాటా సన్స్ పగ్గాలను రతన్ టాటాకు జేఆర్‌డీ అప్పగించారు. వీరిద్దరి మధ్య రక్త సంబంధానికి మించిన అనుబంధం ఉంది. జేఆర్‌డీని 'జే' అని టాటా పిలుచుకుంటారు.