ETV Bharat / business

వృత్తి నైపుణ్యంతోనే ప్రభుత్వ రంగం లాభాల బాట

author img

By

Published : Mar 10, 2021, 8:00 AM IST

ప్రభుత్వ రంగ సంస్థల్లో నష్టాలను కారణంగా చూపుతూ పెట్టుబడుల ఉపసంహరణ పేరిట కేంద్రం అనుసరిస్తున్న విధానాలు ఏళ్లుగా లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)లపై ప్రభావం చూపుతున్నాయి. ఆయా కంపెనీల్లో నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని నిలువరించేందుకు ప్రయత్నించాల్సిన కేంద్రం.. ప్రైవేటీకరణనే సర్వసంజీవనిగా ఎంచుకోవడం దురదృష్టకరం. ఈ క్రమంలో నష్టాల్లో ఉన్న కంపెనీలనే కాకుండా.. బీఎస్​ఎన్​ఎల్​, ఎల్ఐసీ వంటి లాభాల్లో ఉన్న సంస్థల నిర్వహణ నుంచి తప్పుకోవడం దేనికి సంకేతం?

public sector undertakings should be revived with government funding
వృత్తి నైపుణ్యంతోనే ప్రభుత్వ రంగం లాభాల బాట

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థలే నష్టాల బారిన ఎందుకు పడుతున్నాయనే సందేహం రాకమానదు. సరళీకృత నూతన ఆర్థిక విధానాలు మొదలయ్యేంత వరకు ప్రభుత్వ రంగ సంస్థలు అందరి చేతా ప్రశంసలే దక్కించుకున్నాయి. ఆ తరవాతి కాలంలో కునారిల్లిపోవడానికి కారణాలెన్నో తోడయ్యాయి. ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడమే పరమావధిగా ఘనతకెక్కిన నూతన ఆర్థిక విధానాలు- సంస్కరణల మోత మోగించి, ప్రభుత్వ రంగాన్ని ప్రణాళికాబద్ధంగా ధ్వంసం చేయడంలో ఘన కీర్తిని పొందాయి. ప్రభుత్వ రంగంపై ప్రతికూల ముద్ర వేసి, మితిమీరిన అధికార యంత్రాంగం జోక్యంతో చతికిలపడేలా చేసిన ఘనత- తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా అన్ని పార్టీలు, అన్ని ప్రభుత్వాలకు చెందుతుంది.

వాస్తవాలిలా..

ప్రభుత్వరంగ సంస్థల విభాగం(డీపీఈ) 2018-19 సర్వే ప్రకారం- మొత్తంగా మన దేశంలో ఉన్న 339 పీఎస్‌యూలలో నిర్వహణలో ఉన్నవి 257. మిగతా 82 సంస్థలు ఇంకా నిర్వహణ మొదలు పెట్టలేదు. వీటిలో 10 మహారత్నలు, 14 నవరత్నలు, 74 మినీరత్న సంస్థలు ఉన్నాయి. మొత్తం పీఎస్‌యూలలో వీటి వాటా మూడోవంతు పైమాటే. నిశితంగా పరిశీలిస్తే, ప్రభుత్వ రంగ సంస్థలు దేశాభివృద్ధిలో ఎనలేని పాత్ర పోషించాయన్నది స్పష్టమవుతోంది. డీపీఈ వెబ్‌సైట్‌లో పొందుపరచిన వార్షిక నివేదికల ప్రకారం చూస్తే- ప్రభుత్వ రంగం దేశానికి ఎంతమాత్రం గుదిబండ కాదని తెలుస్తోంది. 1951లో అయిదు సంస్థల్లో రూ.29 కోట్లుగా ఉన్న స్థూల పెట్టుబడి 2018 నాటికి 339 సంస్థల్లో రూ.13.73 లక్షల కోట్లకు పెరిగింది. నిర్వహణలో ఉన్న 257 పీఎస్‌యూలలో 184- అంటే 72 శాతం సంస్థలు లాభాల బాటలో ఉన్నాయి. 2018-19 సంవత్సరాంతానికి 1.43 లక్షల కోట్ల రూపాయల లాభాలతో, అంతకుముందు ఆర్థిక సంవత్సరం కంటే 11.36 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఇదే కాలంలో 6.4% వృద్ధితో, కేంద్ర ఖజానాకు 3.72 లక్షల కోట్ల రూపాయలు జమ చేశాయి. మిగిలిన 73 సంస్థల్లో నష్టాలకు కారణాలను గమనిస్తే- కాలం చెల్లిన యాజమాన్య నిర్వహణ పద్ధతులు, మార్కెట్‌ నుంచి గట్టిపోటీ ఎదురవ్వడం, మితిమీరిన ప్రభుత్వ జోక్యం, సంస్థ నిర్వహణలో ప్రతి చిన్నపనికీ సర్కారు ఆదేశాలపై ఆధార పడాల్సి రావడం వంటివెన్నో తోడవుతున్నట్లు కాగ్‌, డీపీఈ నివేదికలు స్పష్టీకరించాయి. దీన్నిబట్టి- ప్రభుత్వ రంగ సంస్థల వ్యాపార నిర్వహణకు తగిన పరిస్థితులను కల్పిస్తూ, ప్రైవేటు రంగానికి ఇస్తున్న ప్రోత్సాహకాలనే ఇస్తే అవి అద్భుతాలు సృష్టించగలవని అవగతమవుతుంది.

దేశంలోని మారుమూల ప్రాంతాల్లో సైతం నెట్‌వర్క్‌ కలిగిన బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఇప్పటిదాకా 4జీ లైసెన్సులను మంజూరు చేయకపోవడం ప్రభుత్వ ఉదాసీనతకు మచ్చుతునక. రద్దీ ఎక్కువగా ఉండి, లాభాలు కురిపించే మార్గాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టి, నష్టాల దారులను ప్రభుత్వ సంస్థలపై రుద్దిన ఫలితంగా విమానయాన రంగం, రోడ్డు రవాణా సంస్థలు నష్టాల పాలయ్యాయి. మారుమూల పల్లెల్లో సైతం ఉనికిని, సిబ్బందిని కలిగి ఉన్న తపాలా శాఖను మరింతగా విస్తరించి, లాభాల బాట పట్టించడంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయానికి వస్తే- వాటికి పూర్తిస్థాయి స్వయం ప్రతిపత్తిని కల్పించి, నిర్ణయాధికారాలను పూర్తిగా వాటికే వదిలేస్తే రుణాల ఎగవేతలను, నిరర్థక ఆస్తుల బెడదను పరిహరించవచ్చు.

ప్రైవేటీకరణ యత్నాలు

దేశ ఆర్థిక రంగానికి వెన్నెముకలా నిలుస్తూ, ప్రభుత్వాలకు అవసరమైనప్పుడల్లా నిధులు సమకూరుస్తూ, సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడే సైనికుల్లా, ఆర్థిక వ్యవస్థను అన్ని రకాల ఆటుపోట్ల నుంచి కాపాడుతున్న జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)ను దొడ్డిదారిలో ప్రైవేటీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పార్లమెంటులో సైతం విస్తృతమైన చర్చకు అవకాశం లేని విధంగా, ద్రవ్య బిల్లులోనే ఎల్‌ఐసీ చట్టం-1956కి 27 రకాల సవరణలు ప్రతిపాదించి, నెగ్గించుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నాయి. అధికారంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ ఇదే తరహా విధానాలను అమలు చేస్తూ, పథకం ప్రకారం ప్రభుత్వ రంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో తమ వంతు పాత్రను పోషించాయనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇప్పటికైనా సరే, ప్రభుత్వ రంగ సంస్థలకు నిర్ణయాధికారం, స్వయంప్రతిపత్తిని కల్పించి, వాటిని స్వేచ్ఛగా, ప్రభుత్వ, అధికార యంత్రాంగం జోక్యం లేకుండా వృత్తి నైపుణ్యంతో నిర్వహించేలా అండగా నిలవాలి. ఇలాంటి చర్యలు తీసుకుంటే ప్రభుత్వ రంగ సంస్థలు కచ్చితంగా లాభాల బాట పడతాయి. ఈ అంశాలను విస్మరించి ప్రైవేటీకరణకే మొగ్గు చూపుతుంటే, అడ్డుకోవడానికి ప్రజాగళం మరింత గట్టిగా వినిపించాల్సిందే.

- ఎం.ఎస్‌.ఆర్‌.ఎ.శ్రీహరి

ఇవీ చదవండి: '3 నెలల్లో రూ.20 వేల కోట్ల జీఎస్​టీ అక్రమాలు'

'కార్పొరేట్లకు రూ. 4.64 లక్షల కోట్ల పన్ను రాయితీలు'

ఎన్నికల తర్వాత భారీ స్థాయిలో పెట్రో బాదుడు?

'జీఎస్‌టీ పరిధిలోకి పెట్రోల్'పై కేంద్రం స్పష్టత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.