సాధారణంగానే భారత్ లోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై అనేక విమర్శలు ఉన్నాయి. రోగుల పట్ల సరైన శ్రద్ధ చూపరనే ఆరోపణతో పాటు సరిపడినంత వైద్య సిబ్బంది, సహాయ సిబ్బంది లేకపోవడం ప్రధాన సమస్య. రోగులకు తగ్గ స్థాయిలో ఆసుపత్రులు, సరిపడినన్ని సదుపాయాలు లేవనేది కాదనలేని వాస్తవం. అందుకోసమే చిన్నపాటి పరీక్షలకు సైతం ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. అయితే ప్రైవేట్ ఆసుపత్రులు కాసుల కోసం అనవసర పరీక్షలు చేసి రోగుల ఆర్థిక స్థితిని దిగజార్చుతాయనే అపఖ్యాతి ఉంది. ఇలా అనేక సవాళ్ల మధ్య కొట్టుమిట్టాడుతోన్న వైద్య రంగం ఇప్పుడు కరోనా కేసులను ఎలా పరిష్కరిచగలదనేది అసలు ప్రశ్న.
దేశ ప్రధాని నుంచి జిల్లా స్థాయి కలెక్టర్ వరకు నిరంతరం సమీక్షిస్తూ ప్రజలకు సూచనలు జారీ చేస్తూనే ఉన్నారు. అయినా ప్రజల్లో అలవాటు పడిపోయిన సమూహ సంచారం భయాందోళనలకు గురిచేస్తోంది. జనతా కర్ఫ్యూ సందర్భంగా సాయంత్రం 5 వరకు ఇళ్లకే పరిమితమైన ప్రజలు తర్వాత ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. గుంపుగుంపులుగా సంచరించారు.
దేశంలో ఆసుపత్రుల పరిస్థితి..
అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు మినహా సాధారణంగానే ఏ దేశంలోనైనా అధిక సంఖ్యలో ప్రజలు ఒకే సారి ఆసుపత్రులకు వచ్చే పరిస్థితి ఉండదు. ఆ కారణంగానే పరిమిత సంఖ్యంలో వివిధ విభాగాల్లో, స్థాయిల్లో వైద్యశాలలు పనిచేస్తుంటాయి. అభివృద్ధి చెందిన దేశాలుగా చెబుతున్న చైనా, అమెరికా లాంటి చోట్లే ప్రస్తుత పరిస్థితికి తగ్గట్టుగా వైద్యశాలలు సరిపోవడం లేదు.
సగటున వెయ్యి మంది రోగులకు అమెరికాలో 3.2 శాతం పడకలు ఉంటే, చైనాలో 2.8, ఇటలీలో 4.3 శాతంగా పడకలు అందుబాటులో ఉన్నాయి. భారత్ విషయానికొస్తే దేశ జనాభాలో సగటున 18వేల మందికి.. కేవలం 10పడకలే అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి విపత్తు వేళలో ఇవి ఎంతమాత్రం సరిపోవనేది నిపుణుల మాట.
84 వేల మందికి ఒక ఐసోలేషన్ !
కరోనా దేశంలోకి ప్రవేశించిందనే వార్తలు వెలువడిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు ఐసోలేషన్, క్వారంటైన్ కేంద్రాల ఏర్పాట్లు చేశాయి. పేరుకు వందల సంఖ్యలో ఉన్నాయని ప్రకటించినా నిశితంగా పరిశీలిస్తే వాస్తవాలు మరో తీరుగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 36 వేల మందికి ఒక క్వారంటైన్ పడక ఉంటే, 84 వేల మందికి ఒక ఐసోలేషన్ పడకే ఉందనే విస్తుగొలిపే నిజాలను అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ఈ అంకెలు మన ఆసుపత్రుల సామర్థ్యాన్ని తెలిపేందుకు మచ్చు తునకలు. ఈ నేపథ్యంలో ఇంట్లోనే విడిగా ఉండాలని సూచిస్తూ విడిచిపెడుతున్నారు. వీరిలో చాలా మంది బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తున్నారు. వీళ్ల వల్ల అనేక మందికి వైరస్ వ్యాపించే అవకాశాలు ఉన్నాయి.
వెంటిలేటర్లదీ అదే స్థితి..
కరోనా సోకిన వారికి శ్వాసకోస సమస్యలు వస్తాయి. వ్యాధి ముదిరితే వారికి కచ్చితంగా వెంటిలేటర్లతో దాదాపు 21 రోజులకు పైగా కృత్రిమ శ్వాస అందించాల్సి ఉంటుంది. మన దేశంలో మొత్తంగా 40 వేల వరకు వెంటిలేటర్లు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. వైరస్ తీవ్రంగా ప్రబలిన దేశాలల్లోని స్థితిని పరిశీలిస్తే కరోనా సోకిన వాళ్లల్లో దాదాపు 5 శాతం మందికి వెంటిలేటర్లు అవసరం అవుతాయి. 130 కోట్ల మంది ఉన్న దేశంలో ఇది చాలా ఎక్కువ.
స్పెయిన్ వంటి దేశాల్లో రోగులకు వెంటిలేటర్లు సమకూర్చలేక ప్రాణాలు కోల్పోతున్నా నిర్దాక్షణ్యంగా వదిలివేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా లాంటి అగ్రగామి దేశాల్లో కరోనా బాధితుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో అక్కడి వైద్య సదుపాయాలు సరిపోవని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మాస్కులు, శానిటైజర్లు..
దేశంలోకి కరోనా వైరస్ ప్రవేశించిందనే వార్తలు వెలువడగానే మాస్కులకు, శానిటైజర్లకు తీవ్రమైన కొరత ఏర్పడింది. ఆసుపత్రుల్లో పనిచేసే వైద్య సిబ్బందికీ పూర్తిస్థాయిలో రక్షణ సౌకర్యాలు కల్పించుకోలేకపోతున్నాం. అందుకే దేశంలో బలంగా ఉన్న ఫార్మా రంగం ఈ దిశగా వేగంగా అడుగులు వేయాలి. వైద్య సంబంద రక్షణ పరికరాలను వేగంగా భారీగా ఉత్పత్తి చేయాలి. దేశంలోకి అన్ని వర్గాల వారికి ఇవి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
పరీక్ష కిట్లు..
భారత్‌లో వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తుందనే అనుమానాలు ఉన్నాయి. ఇప్పటి వరకు నిర్వహిస్తున్న కరోనా పరీక్షల సంఖ్యను ఇంకా రెట్టింపు చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈ పరీక్షా కిట్లను మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. కరోనా పరీక్షల ఖరీదు దాదాపు 4 నుంచి 5 వేల వరకు అవుతుండడంతో పాటు ఫలితాలకు గంటల కొద్ది సమయం పడుతోంది. దానికి తోడు మన దగ్గర ప్రస్తుతానికి లక్ష కిట్లు భవిష్యత్తు అవసరాలకు ఎంత మాత్రమూ సరిపోవు. ఈ పరిస్థితిలో స్థానికంగానే పరీక్షా కిట్లను రూపొందించుకుని అభివృద్ధి చేయాల్సి ఉంది.
ప్రస్తుత కఠిన పరిస్థితుల్లో మన వైద్య రంగం ఎంత మేర నిలకడగా రోగులకు సేవలు అందించగలదనేది వేచి చూడాలి. ఇలాంటి విపత్కర స్థితులు భవిష్యత్తులోనూ మరికొన్ని ఎదురుకావచ్చు. వాటన్నింటికీ భారత్ తయారీగా ఉండాలంటే... ఎప్పటికప్పుడు వైద్య వ్యవస్థ స్వరూపాన్ని, సదుపాయాలను మెరుగుపరుచుకోవడమే మార్గం.
ఇదీ చూడండి: కరోనా వైరస్ ఒకరి నుంచి కనీసం ముగ్గురికి!