మొదటిసారే కానీ..
12 ఏళ్లకు ఓసారి వచ్చే బ్రహ్మపుత్ర పుష్కర మేళా ఇప్పటివరకు దక్షిణ భారత దేశంలో మాత్రమే నిర్వహించేవారు. దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లో ప్రవహించే బ్రహ్మపుత్ర నదికి పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యం ఉంది. అయితే, మొదటి సారి ఉత్తరాది రాష్ట్రం అయిన అసోం ప్రభుత్వం పుష్కర మేళా నిర్వహించేందుకు ముందుకువచ్చింది.
పవిత్రమైన బ్రహ్మపుత్రలో మునకలు వేసి పునీతమయ్యేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగువారు పెద్ద సంఖ్యలో అసోంకు తరలివెళ్లారు. భక్తుల రాకతో ఆ రాష్ట్ర టూరిజం విభాగం రాష్ట్రంలో పర్యటకుల సంఖ్య పెరిగిందని వెల్లడించింది.
ఏర్పాట్లన్నీ అదిరిపోయాయి..
అసోం ప్రభుత్వంతో, ఆ రాష్ట్రంలో ఉన్న తెలుగు అసోసియేషన్ వారు నిర్వహణా బాధ్యతలు స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకున్నారు.
ఉచితంగా ఆహారం అందించి, కూర్చోడానికి తగిన ఏర్పాట్లు చేశారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ ప్రత్యేక స్నాన ఘాట్లు వంటి అన్ని సౌకర్యాలను సమకూర్చారు. 38 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
పది రోజులపాటు నిరవధికంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలు, మహా పుష్కర హారతులు భక్తులకు కనువిందు చేశాయి.
పుష్కరుని ఆశీస్సులతో మోక్షాన్ని పొంది పితృ దేవతలను తరింపజేయాలని విచ్చేసిన తెలుగు ప్రజలు ఏర్పాట్లు చూసి హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:వాతావరణ మార్పులతో.. పిల్లల ఆరోగ్యానికి పెను ముప్పు