ఇసుక దోపిడీకి 'తెర ముందు తమ్ముడు - తెర వెనక అన్న': నక్కా ఆనంద్‌బాబు
🎬 Watch Now: Feature Video
Nakka Ananda Babu on YCP Illegal Sand Mining: 'తెర ముందు తమ్ముడు.. తెర వెనక అన్న' అన్నట్లుగా రాష్ట్రంలో ఇసుక దోపిడీకి జగన్ తెర లేపారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి పేషీ ఆధ్వర్యంలో జరిగే ఇసుక కుంభకోణంలో తెర ముందు ముఖ్యమంత్రి సోదరుడు అనిల్ ఉంటే, తెర వెనక ఉంది జగన్మోహన్ రెడ్డేనని తెలిపారు. ఈ నాలుగున్నరేళ్లలో సాగిన ఇసుక దోపిడీ ఒక ఎత్తైతే.. వచ్చే 6 నెలలు సాగే దోపిడీ మరో ఎత్తని అన్నారు. టెండర్ డాక్యుమెంట్లో ఏముందో కూడా తెలుసుకోవటానికి వీలు లేకుండా చేశారని విమర్శించారు. టెండర్ డాక్యుమెంట్లో ఏముందో తెలుసుకోవాలంటే దేశంలో ఎక్కడా లేని విధంగా 29.5లక్షల రూపాయల ధర నిర్ణయించడం దోపిడీ కాక మరేంటని నక్కా ఆనంద్‌బాబు నిలదీశారు.
దోపిడీ కోసమే వెంకట్‌రెడ్డిని ఏపీఎండీసీ ఎండీగా తీసుకొచ్చారని మండిపడ్డారు. మార్చి నెలలోనే హరిత ట్రిబ్యునల్ ఇసుక తవ్వకాలు నిషేధించినా, ఆదేశాలు బేఖాతరు చేశారని ఆరోపించారు. నిబంధనలు అన్నీ ఉల్లంఘించి ఇసుక దోపిడీ చేస్తూ, చంద్రబాబుపై ఎదురు కేసు పెట్టటం సిగ్గనిపించట్లేదా అంటూ దుయ్యబట్టారు. ఇసుక అక్రమాలు, బిల్లుల చెల్లింపులపై తమ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేక తప్పించుకు తిరుగుతున్నాడని మండిపడ్డారు. ఇసుక తవ్వకాలపై దొంగ వే బిల్స్ విషయంలో కలెక్టర్ల నుంచి అధికారులంతా బలి కావాల్సిందేనని నక్కా ఆనంద్‌బాబు హెచ్చరించారు.