కడప జిల్లా జమ్మలమడుగులో కొన్నేళ్లుగా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వలస కూలీలు ఆశ్రయం పొందుతున్నారు. కరోనా వైరస్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం సొంత రాష్ట్రానికి పంపించేందుకు చర్యలు తీసుకుంది. బుధవారం సాయంత్రం మొత్తం 112 కుటుంబాలకు చెందిన సభ్యులకు రెవెన్యూ అధికారులు ఫోన్ల ద్వారా సమాచారం అందించారు. కడప నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రాత్రి రైలు బయలు దేరుతుందని కాబట్టి... అందరూ ఎమ్మార్వో ఆఫీస్‌కు చేరుకోవాలని అధికారులు చెప్పారు.
ఆ సమాచారం అందుకున్న యూపీ వాసులు సంబరపడ్డారు. మధ్యాహ్నం నుంచి వారంతా ఇల్లు ఖాళీ చేసి యజమానులకు తాళాలు ఇచ్చేశారు. సామాన్లతో వీరంతా జమ్మలమడుగు తాహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ లోగా వైద్యులు, వైద్య సిబ్బంది వచ్చి ఉష్ణోగ్రత పరీక్షలు సైతం చేశారు. బస్టాండ్ నుంచి ఆర్టిసీ బస్సులు కదిలాయి. ఇంతలోనే తహసీల్దారుకు పిడుగులాంటి వార్త వచ్చింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తమ ప్రాంత వాసులను తరలించే విషయంపై... ఏపీ ప్రభుత్వానికి అనుమతులు ఇవ్వలేదని ఆయన సమాచారం అందింది.
రెవెన్యూ అధికారులు చేసేదిలేక ఈ విషయాన్ని వలసకూలీలకు చెప్పారు. ఇల్లు ఖాళీ చేసి యజమానులకు తాళాలు ఇచ్చి వచ్చేశాం... మళ్ళీ వెనక్కి వెళ్తే మా పరిస్థితేంటి అంటూ వారు ప్రశ్నించారు. జిల్లా స్థాయి అధికారుల నుంచి సమాచారం రాగానే మళ్లీ ఫోన్ చేసి చెప్తామని సర్దిచెప్పడం వల్ల ప్రజలు నిరాశగా వెనుదిరిగారు.
ఇదీ చదవండి: