Subsidy Tomatoes in Kadapa Vegetable Market: టమాట.. ఇప్పుడు ఎక్కడ చూసిన దీని గురించే చర్చలు. ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారంటే.. కచ్చితంగా అక్కడ టమాట పేరు వస్తుంది. సోషల్ మీడియాలో సైతం టమాటాలపై రకరకాల ట్రోల్స్, మీమ్స్ ఇలా ఏదో రూపంలో వాటికి లింక్ పెడుతున్నారు. అలాగే మార్కెట్‌కు పోయి రేటు గురించి తెలుసుకున్న కొనుగోలుదారుల గుండెలు గుబేలుమంటున్నాయి. అది లేనిదే కూర రుచి ఉండదు. ఎన్ని ప్రత్యామ్నాయ పద్ధతులు ఉపయోగించినా.. దాని రుచి దేనికీ రాదు. కానీ కొనాలంటే బంగారం కన్నా ఎక్కువైంది.
అయితే కొనుగోలుదారుల తీరు ఇలా ఉంటే.. టమాటలను పండించిన వారు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారు. చాలా మంది సినిమాల్లో నటించి రాత్రికి రాత్రే స్టార్డమ్ తెచ్చుకున్నట్లు.. చాలా మంది రాత్రికి రాత్రే లక్షాధికారులు అవుతున్నారు. టమాట తోటలకు సెక్యూరిటీని పెట్టుకోవడం, వ్యాపారులైతే సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నారు. అయితే టమాట రేట్లు ఎలా పెరుగుతున్నాయో.. అంతకంటే ఎక్కువ దొంగతనాలు, హత్యలు జరుగుతున్నాయి. టమాట రైతుల దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుందని తెలుసుకుంటున్న కేటుగాళ్లు.. దొంగతనాలు.. వీలేతై హత్యలు కూడా చేసి ఆ డబ్బును దోచుకుంటున్నారు. కాగా కొన్ని చోట్ల సబ్సీడికి టమాటలు అందిస్తుండటంతో కొనుగోలుదారుల ముఖాలు వెలిగిపోతున్నాయి. కానీ అవి వెంటనే లభిస్తాయి అనుకుంటే పొరపాటే. వాటికి కోసం కిలోమీటర్ల మేర లైన్లో నిలబడాలి. అయినా టమాట ప్రియులు.. ఎక్కడా తగ్గేదేలే అంటూ లైన్లలో నిలబడి మరి వాటిని కొనుక్కుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కడపలో చోటుచేసుకుంది. సబ్సీడీపై టమాటలు ఇస్తుండటంతో తెల్లవారుజాము నుంచే లైన్లలో నిలబడుతున్నారు.
తాజాగా కడప రైతు బజార్‌కు ఇవాళ సబ్సిడీతో రెండు టన్నుల టమాటలు రావడంతో వాటి కోసం ఉదయం నుంచి ప్రజలు ఎదురుచూస్తున్నారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేరకు ప్రజలు బారులు తీరారు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు మొత్తం టమాటల కోసం క్యూ లైన్లో నిలబడ్డారు. ఆధార్ కార్డు ఉంటేనే టమాటలు ఇస్తున్నారు. ఇంట్లో పనులు అన్నింటిని మానుకొని మరీ వాటి కోసం పరుగులు తీశారు. కిలో 48 రూపాయలు చొప్పున విక్రయించడంతో ప్రజలు విపరీతంగా తరలివచ్చారు. అయితే టమాట పక్కదారి పడుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. రెండు టన్నుల టమాట అంటే దాదాపు 200 మందికి కిలో చొప్పున విక్రయించవచ్చు. బయట మార్కెట్లలో కిలో వంద నుంచి రెండు వందల రూపాయలు చొప్పున విక్రయిస్తున్నారు. పూర్తిస్థాయిలో టమాట విక్రయాలు కొనసాగించాలని.. సక్రమమైన పద్ధతుల ద్వారా ప్రజలకు అందజేయాలని కోరుతున్నారు. రారామ్మని కొనుగోలుదారులు అంటుంటే.. నేను రాను అని టమాటలు కొండెక్కి కూర్చుంటున్నాయి. ఏమైనా టమాట ధరలు ఎప్పుడూ తగ్గుతాయా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.