కడుప జిల్లాలో మత్స్యశాఖ పర్యవేక్షణలో 239 చెరువులు ఉన్నాయి. 28,483.08 హెక్టార్లలో నీరు నిల్వ ఉంటుంది. అందులో చేపలు పెంచేందుకు 14,241.54 హెక్టార్లు అనువుగా ఉంటుందని ఆ శాఖ అధికారులు గుర్తించారు. గత నెలలో కురిసిన భారీ వర్షాలతో చాలా తటాకాల్లోకి నీరు చేరింది. వీటిలో వదిలేందుకు చిరు చేప పిల్లలు 3,53,37,600 కావాలి. రకాన్నిబట్టి హెక్టారుకు 1700- 2 వేలు వదలాల్సి ఉంటుంది. అదేవిధంగా చిన్న, మధ్యతరహా, పెద్ద జలాశయాలు 15 ఉంటే వీటిల్లో 21,767 హెక్టార్లలో జలం నిలుస్తోంది. వీటిలో వదిలేందుకు విత్తన పిల్లలు 1,78,08,000 అవసరం కానుంది. జిల్లాలో కడప, బ్రహ్మంసాగర్, రాజంపేట, మైలవరం జలాశయాల్లో 540 లక్షల చిరు చేపల పిల్లలను పెంచాల్సి ఉంది. కాకపోతే 120 లక్షలే పెంచారు. ప్రస్తుతం నీటిలో వదలడానికి అనువైన 25- 50 మి.మీ పరిమాణంలోని మీనాలు 20.90 లక్షలు మాత్రమే ఉన్నాయి.
ఒకే రకం పెంపకం..
విపణిలో మంచి గిరాకీ ఉన్న కృష్ణ బొచ్చె, ఎర్రమోసు, బంగారు తీగ, వాలుగ, గడ్డిచేప, దొమ్మ, జిలేబి, కొర్రమేను, కాకిగండి, క్షీరమేను రకాల పెంపకాన్ని విస్మరించారు. జిల్లాలో ఈసారి నాలుగు ప్రాంతాల్లో శీలావతి రకాన్ని మాత్రమే 120 లక్షలు పెంచుతుండగా 21 లక్షలు చేతికి రావడమే గగనమైంది. మిగతా పిల్లలను కోస్తా ప్రాంతం నుంచి తెప్పించాలని నిర్ణయించారు. రాష్ట్ర స్థాయిలో ఇంకా గుత్తపత్రాల ప్రక్రియను చేపట్టలేదు. టెండర్లు పిలిచి ధరను ఖరారు చేయాల్సి ఉంది. అంతదూరం నుంచి రవాణా చేయడం వల్ల చాలా చేపపిల్లలు చనిపోతున్నాయి. జిల్లాలోనే సరిపడా పెంచితే రవాణా భారం తగ్గుతుంది.
చేపల పెంపకంపై దృష్టి
జిల్లాలో చేపల పెంపకంపై దృష్టిసారించాం. చెరువులు, జలాశయాల్లోకి నీరు వచ్చింది. మన జిల్లాకు 540 లక్షల పిల్ల చేపలు పెంచాల్సి ఉంది. బ్రహ్మంగారిమఠం, కడప, రాజంపేట, మైలవరంలో ఇప్పటికే 120 లక్షలను పెంచుతున్నాం. నీటిలో వదలాలంటే 25 మి.మీ కంటే ఎక్కువ పరిమాణం ఉండాలి. ఈ సైజులో 20 లక్షలు పిల్లలు అందుబాటులో ఉన్నాయి. త్వరలో ఉత్పత్తి కేంద్రాల నుంచి తీసుకెళ్లి అనుమతి ఉన్న జల వనరుల్లో వదిలేందుకు ప్రణాళిక రూపొందించాం. అనుమతి కోసం రాష్ట్ర ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. మరికొన్ని పిల్ల చేపలు అవసరమని నివేదించాం. ఉత్తర్వులు రాగానే చర్యలు తీసుకుంటాం. - ఎ.నాగరాజ, ఉప సంచాలకులు, మత్స్యశాఖ, కడప
ఇదీ చదవండి: కుటుంబం ఆత్మహత్య ఘటన.. దర్యాప్తు వేగవంతం