MP AVINASH REACTS ON CBI NOTICES : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా సీబీఐ ఇచ్చిన నోటీసులపై ఎంపీ అవినాష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిన్న నోటీసులు ఇచ్చి.. నేడు విచారణకు రమ్మంటే ఎలా అని ప్రశ్నించారు. నాలుగైదు రోజుల్లో సీబీఐ విచారణకు హాజరవుతానని తెలిపారు. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నందునే ఇవాళ రాలేనని సీబీఐకి సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. తన లేఖపై సీబీఐ అధికారులు మళ్లీ నోటీసు ఇచ్చే అవకాశం ఉందన్న అవినాష్.. తదుపరి నోటీసు తీసుకుని విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. వివేకా హత్య కేసులో సీబీఐ అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతానని పేర్కొన్నారు.
తనపై వచ్చిన అభియోగాలు జీర్ణించుకోలేకపోతున్నట్లు అవినాష్ తెలిపారు. తనేమిటో.. తన వ్యవహార శైలి ఏంటో జిల్లా ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. న్యాయం గెలవాలి.. నిజం వెల్లడి కావాలన్నదే తన ధ్యేయం అన్న అవినాష్.. వివేకా కేసులో నిజం తేలాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆరోపణలు చేసేవారు మరోసారి ఆలోచించాలని సూచించారు. వైెెఎస్సార్ జిల్లా చక్రాయపేట మండలం గండి ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని సందర్శించిన అవినాష్ రెడ్డి.. శాశ్వత అన్నప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సంచలనం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ హైదరాబాద్‌కు మారిన నేపథ్యంలో,.. సీబీఐ అధికారులు కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి నోటీసులివ్వడం సంచలనంగా మారింది. ఇప్పటిదాకా.. ఈ కేసులో ఒక్కసారి కూడా అవినాష్‌ను ప్రశ్నించని సీబీఐ అధికారులు.. సోమవారం పులివెందుల వెళ్లారు. అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి నివాసానికి వెళ్లి.. ఆయన కోసం ఆరా తీశారు. భాస్కర్‌రెడ్డి అక్కడ లేకపోవడంతో.. స్థానిక వైసీపీ కార్యాలయానికి వెళ్లి అడిగారు. భాస్కర్‌రెడ్డి.. అప్పటికే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది.
కానీ అక్కడికి రాలేదంటూ పార్టీ కార్యకర్తలు చెప్పడంతో.. దాదాపు అరగంటపాటు సీబీఐ అధికారులు అక్కడే వేచి చూశారు. కాసేపటికి.. అవినాష్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు రాఘవరెడ్డి వచ్చి సీబీఐ అధికారులతో.. మాట్లాడారు. తన సెల్‌ఫోన్ నుంచి ఎవరికో కాల్ చేసి వారికి ఇచ్చారు. ఆ కాల్‌లో.. మాట్లాడిన అధికారులు కొన్ని వివరాలు సేకరించారు. అనంతరం అవినాష్‌రెడ్డికి.. జారీ చేసిన నోటీసులను రాఘవరెడ్డికి అందజేసి వెళ్లిపోయారు. ఈ ఉదయం 11 గంటలకు హైద్రాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి రావాలని.. అవినాష్‌రెడ్డిని అందులో కోరారు.
ఇవీ చదవండి: