కడప జిల్లా రైల్వే కోడూరులో కరోనా నిబంధనలు కొందరు కాలరాస్తున్నారు. లాక్డౌన్ 1.Oను పకడ్బంధీగా అమలు చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు లాక్డౌన్ 5.Oను మాత్రం చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఓపక్క కరోనా కేసులు విజృంభిస్తున్నా... నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాల పేరుతో ప్రజాప్రతినిధులు కరోనా నిబంధనలు పాటించటం లేదు. భౌతికదూరం, మాస్కులు ధరించాల్సి ఉన్నా... అవేవి లేకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. అధికార పార్టీ నేతల పుట్టినరోజు వేడుకలను సైతం ఘనంగా నిర్వహిస్తూ... అధిక సంఖ్యలో జనం ఒకేచోట గుమిగూడేలా చేస్తున్నారు. భారీ కేక్ కటింగ్లు, బాణసంచా పేలుళ్లతో పట్టణంలో హంగామా సృష్టిస్తున్నారు.
ప్రస్తుతానికి రైల్వేకోడూరు గ్రీన్జోన్లో ఉన్నప్పటికీ వీరి నిర్లక్ష్యం కారణంగా కరోనా విజృంభించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు బాధ్యతతో మెలగాలని సూచిస్తున్నారు.