చేనేత కార్మికులను ఆదుకునేందుకు ఉద్దేశించిన కార్యక్రమంలో 2010 నుంచి అక్రమాలు జరిగినట్లు గుర్తించిన ప్రభుత్వం.. దర్యాప్తు బాధ్యతను సీఐడీకి అప్పగించింది. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు ఆసక్తికరంగా సాగుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ నేత లాకర్‌లో దాదాపు 2 కేజీల బంగారం లభించినట్లు తెలుస్తుండటం చర్చనీయాంశమైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా గతంలో ఆప్కో ఛైర్మన్‌గా పనిచేసిన గుజ్జల శ్రీనివాసులు నివాసంలో సీఐడీ అధికారులు ఇటీవల సోదాలు చేసి బంగారం, నగదు, విలువైన పత్రాలను సీజ్ చేశారు.
ఈ క్రమంలోనే సీఐడీ అధికారులు ఒక లాకర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ రోజు గుజ్జల కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడంతో దాన్ని తెరవలేదని సమాచారం. ఆ లాకర్‌ను అలాగే తీసుకొచ్చి కడప జిల్లా కేంద్రంలోని ఖజానాలో భద్రపరిచినట్లు తెలిసింది. అప్పటి నుంచి దాన్ని తెరిచేందుకు సహకరించాలని గుజ్జల శ్రీనివాసులు కుటుంబాన్ని అధికారులు కోరుతున్నారు. అయితే లాకర్ ఎవరి పేరున ఉందో వారే వచ్చి తెరవాల్సి ఉండటంతో బుధవారం గుజ్జల శ్రీనివాసులు భార్య కడపలోని ఆప్కో కార్యాలయానికి వచ్చి సీఐడీ అధికారుల సమక్షంలో లాకర్ తెరిచినట్లు సమాచారం. ఆ లాకర్‌లో సుమారు రెండు కేజీల వరకూ బంగారం, ఇతర విలువైన వస్తువులు ఉన్నాయని వాటికి సంబంధించిన వివరాలు అధికారులు సేకరిస్తున్నట్లు తెలిసింది.
ఇదీ చదవండి: స్థానికంపై సమరం...కొత్త నోటిఫికేషన్‌కు విపక్షాలు పట్టు