కడప జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని జిల్లా కలెక్టర్ హరికిరణ్ స్పష్టం చేశారు. ఆ దిశగా కొప్పర్తి పారిశ్రామిక వాడను..రాష్ట్రంలోనే మోడల్ ఇండస్ట్రీయల్ పార్కుగా తీర్చిదిద్దనున్నారన్నారు. పారిశ్రామిక వాడను సందర్శించిన ఆయన.. నిర్దేశించిన గడువులోగా పారిశ్రామిక వాడల్లో మౌలిక వసతుల ఏర్పాటు పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
కొప్పర్తి పారిశ్రామిక వాడలో జిల్లాకే తలమానికంగా 'వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్' (ఈఎంసీ) ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. అందుకు సంబంధించి 5,098 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ..రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు. ఎలక్ట్రానిక్ హబ్ ఏర్పాటులో భాగంగా డిక్సన్ కంపెనీ నూతనంగా నిర్మిస్తున్న యూనిట్లను పరిశీలించారు. పిట్టి, నీల్ కమల్ కంపెనీల ఏర్పాటుకు కొప్పర్తి పారిశ్రామిక వాడ వేదికవుతోందన్నారు.
పారిశ్రామిక వాడలో నిర్మాణంలో ఉన్న ల్యాండ్ డెవలప్మెంట్, రోడ్ల నిర్మాణ ఏర్పాట్లను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. పారిశ్రామిక వాడకు వెళ్లే..ప్రధాన రహదారి ముఖ ద్వారం నుంచి 2.5 కిలో మీటర్ల మేర 6 లైన్ల రోడ్డు నిర్మాణం కోసం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నూతన పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు. భూమి చదును, అప్రోచ్ రోడ్ల నిర్మాణ పనులు, డ్రైన్ల పనులు, నీటి వనరుల సదుపాయం, షెడ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఇదీచదవండి